కరోనా తర్వాత ‘డెంగీ’ ( Dengue ) భాగ్యనగర వాసుల్ని ఎక్కువగా కలవర పెడుతోంది. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నవారిలో కొందరు డెంగీ బారిన పడుతున్నారు. చికిత్స కోసం ఏకంగా బడా ఆస్పత్రుల్లోనే చేరుతున్నారు. హైదరాబాద్లోని పలు గేటెడ్ కమ్యూనిటీల్లో డెంగీ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా, పశ్చిమ హైదరాబాద్లో ఈ బెడద ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు అన్నీ గేటెడ్ కమ్యూనిటీల్లో నిర్వహణ మెరుగ్గానే ఉన్నప్పటికీ.. వీటికి చుట్టుపక్కల గల ఖాళీ స్థలాలు, నాలాలు, డ్రైనేజీలు వల్ల డెంగీ దోమలు పెరుగుతున్నాయని జీహెచ్ఎంసీ సిబ్బంది చెబుతున్నారు. పైగా, నివాసితులు పలు జాగ్రత్తల్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేమిటంటే..
- అపార్టుమెంట్లలో నివసించేవారు పూలకుండీల కింద ప్లేట్లను ఎక్కువగా పెడుతుంటారు. ఆ నీటిని క్రమం తప్పకుండా మార్చాల్సి ఉన్నా కొందరు పని ఒత్తిడిలో పడి మర్చిపోతుంటారు. ఇలాంటి నిర్లక్ష్యమే డెంగీ దోమల పుట్టుకకు కారణమని చెప్పొచ్చు. కాబట్టి, పూలకుండీల కింద ఉండే ప్లేట్లలో నీళ్లు లేకుండా చూసుకోవాలి.
- కొందరు ఏసీల నుంచి వచ్చే నీరు కింద పడకుండా ఏదో ఒక బకెట్ లేదా మగ్గు పెడుతుంటారు. కానీ, దాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయడాన్ని మర్చిపోవడంతో డెంగీ దోమలకు ఆవాసంగా మారుతుంది. అక్కడే గుడ్లను పెడతాయి.
- ఒక చిన్న టీ స్పూన్ లేదా బాటిల్ మూతలో వారం రోజులపాటు నీటి చుక్క నిల్వ ఉంటే చాలు.. అక్కడ డెంగీ దోమలకు స్థావరంగా మారుతుంది. అక్కడే కొన్ని వేల గుడ్లను డెంగీ దోమలు పెడతాయి.
- మీ ఫ్లోరులో కానీ ఫ్లాట్ బయట కానీ నిరుపయోగంగా ఎలాంటి వస్తువులున్నా వెంటనే వాటిని తొలగించండి. అందులోకి నీరు చేరితే చాలు.. డెంగీ దోమలు మీ ఇంటితో పాటు చుట్టుపక్కల ఫ్లాట్లకు వచ్చేసినట్లే.
- వారానికోసారి ఫ్లాటును పరిశుభ్రం చేసుకోవాలి. ఎక్కడా నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి.
- గార్డెన్లు, స్విమ్మింగ్ పూల్ వంటి వాటిలో నీళ్లు నిల్వ ఉండకూడదు. క్రమం తప్పకుండా వాటిని శుభ్రం చేయాలి.
డెంగీ దోమలెంతో డేంజర్ (బాక్స్)
- డెంగీ జీవితకాలం కేవలం 25-35 రోజులే. కానీ అది సృష్టించే కల్లోలం అంతాఇంతా కాదు.
- నీరు నిల్వ ఉన్న చోట.. ఒకేసారి కనీసం వెయ్యి గుడ్లు పెడుతుంది
- ఇలా కనీసం ఐదు సార్లు గుడ్లను పెట్టగలదు
- డెంగీ దోమలు ఎంతలేదన్నా వంద మీటర్లు ప్రయాణిస్తుంది.