Categories: Celebrity Homes

పాత, కొత్త కలయిక కనువిందు చేస్తుంది

  • రియల్ ఎస్టేట్ గురుతో
    ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా

మనీష్ మల్హోత్రా.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు పని చేశారు. ఫ్యాషన్ అంటే ఎంతో మక్కువ కలిగిన మనీష్ ఇల్లు ఇంకెంత ఫ్యాషన్ గా ఉంటుందో చూడాలనిపించింది. ఈ సందర్భంగా ఆయన తన ఇంటి గురించి ‘రియల్ ఎస్టేట్ గురు’తో ముచ్చటించారు. అవేంటో చూసేద్దామా?

మనీష్ మల్హోత్రా ఐదంతస్తుల టౌన్ హౌస్ బాంద్రా పాలిహిల్ లోని బైలేన్ లో ఉంది. అదే ఆయన ఇల్లు. సున్నితత్వానికి సహజమైన ప్రతిబింబం కూడా. కానీ అందంగా అలంకరించిన త్రోలు, కుషన్లు, ప్రకాశవంతమైన రంగులు లేవు. దీని గురించి ఆయన ఏం చెప్పారంటే.. ‘నేను రోజంతా బ్లింగ్ అండ్ షైన్, ఎంబ్రాయిడరీలు, రంగులతో గడుపుతాను. అందువల్ల నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు కావాల్సింది అవి కావు. పాతకాలపు, ఆధునికతను మేళవించి కంటికి ఇంపైన సాధారణ వస్తువులు చాలు’ అని పేర్కొన్నారు. మనీష్ ఇంటిని పరిశీలిస్తే.. వెలుపలి భాగం అంతా తెల్లగా ఉండగా.. ఇంటీరియర్లన్నీ లేత గోధుమరంగు, బంగారు, వివిధ ముదురు రంగులు కనిపిస్తాయి.

అందమైన రగ్గులతోపాటు క్రీమ్, ముదురు నీలం, ఆకుపచ్చ రంగుల్లో వెల్వెట్ సోఫాలు, తోలు వస్తువులు, సున్నితమైన ఆకర్షణీయమైన షాండ్లియర్లు దర్శనమిస్తాయి. ఇవన్నీ స్వయం ప్రకాశితాలు అన్నట్టు కనిపించేందుకు పెద్ద పెద్ద ఫ్రెంచ్ కిటికీల నుంచి ఇంట్లోకి సహజమైన కాంతి పుష్కలంగా వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మనీష్ ఇల్లు మిగిలినవాటిలా కాకుండా వాస్తవిక నేపథ్యాలను ప్రతిబింబిస్తుంది. ఇక తన ఇంటి అలంకరణ కోసం ఆయన పురాతన వెండి వస్తువులను సేకరిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. లేత గోధుమరంగు మార్బుల్ తో ఫ్లోరింగ్, ముదురు రంగు చెక్కలతో కప్ బోర్డులు ఆహ్లాదంగా కనిపిస్తాయి.

మనీష్ ఇంటి బాల్కనీలోకి వెళితే అక్కడి రీగల్ డెకర్ కట్టిపడేస్తుంది. రాజస్థాన్ లోని కోట నుంచి నేరుగా తీసుకొచ్చి అమర్చారా అనేంత అందంగా ఉన్నాయి. మరోవైపు టెర్రస్ మొత్తం పచ్చదనంతో హాయిగొలుపుతుంది. అక్కడ వుడెన్ ఫ్లోరింగ్ ఆకట్టుకుంటుంది. చక్కని పార్టీలు, వేడుకలు చేసుకోవడానికే కాదు.. ముంబైలో సూర్యాస్తమయాన్ని చక్కగా ఆస్వాదించడానికి మంచి వేదిక కూడా. ప్రస్తుతం ఉన్న 11 వేల చదరపు అడుగుల ఇంటికి అదనంగా 5 వేల చదరపు అడగులు జోడిస్తున్నట్టు మనీష్ తెలిపారు. ‘ఇది ఎక్స్ టెన్షన్ మాత్రమే కాదు.. ఒక విధంగా మా ఇంటికి కొత్త రూపం తీసుకొస్తున్నాం. నాకు ఇది మరింత ఆధునికంగా మరింత మినిమల్ గా ఉండాలి. దానికి నా కళ, నా వ్యక్తిత్వం కూడా తోడు కావాలి. యువ ప్రతిభను వెలుగులోకి తెచ్చే బలమైన ‘మేడిన్ ఇండియా’ ఫోకస్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను’ అని వివరించారు.

సొంత ఇల్లు ఉండాలనే ఆలోచన తనకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ఇల్లు కొనే సమయంలో ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాకు పని చేస్తున్నారు. అప్పుడు లండన్ లో షూటింగ్ జరుగుతోంది. దీంతో అక్కడి డిజైన్లు ఆయన్ను బాగా ప్రభావితం చేశాయి. చెక్క స్తంభాలు, మౌల్డింగ్ ల వినియోగం, లేత-బూడిద రంగు ప్యాలెట్, పాత, కొత్త వాటిని నిరంతరం మేళవించడం వంటి అంశాలతో స్ఫూర్తిని పొందారు. సంప్రదాయ వెండి కుండీలు, ఉర్లీల వాడకంలో రోచె బొబోయిస్ ఫర్నిచర్, గ్రేట్ ఈస్టర్న్ హోమ్ యాంటిక్స్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దాదర్ పూల మార్కెట్ నుంచి వారానికి ఒకసారి తీసుకొచ్చే తాజా పూల అలంకరణ మనీష్ ఇంటికి కొత్త అందం తీసుకొస్తుంది. ఆభరణాలను అలంకరించినట్టుగా ఉండే పర్షియన్ తివాచీలు చల్లని అనుభూతిని కలిగిస్తాయి. తెల్లటి పాలరాతి అంతస్తులు, గోడపై ఉన్న రజాలు ఇంటికి మరింత వన్నె తెచ్చాయి. ‘ఇంట్లోని ప్రతి చిన్న వస్తువునూ నేను అత్యంత జాగ్రత్తతో ఎంపిక చేసి, చక్కగా అమరుస్తాను. అవన్నీ వైవిధ్యంగా, ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాను’ అని మనీష్ చెప్పి ముగించారు.

This website uses cookies.