Categories: ReraTOP STORIES

సుహాస్ ప్రాజెక్ట్స్‌కు టీఎస్ రెరా నోటీసు!

  • నిట్ట‌నిలువునా మునిగిపోతున్న నిర్మాణ రంగం
  • అగాథంలోకి ప‌డిపోయిన రియ‌ల్ ప‌రిశ్ర‌మ‌
  • ఈ రంగానికి సోకిన ప్రీలాంచ్, యూడీఎస్‌ క్యాన్స‌ర్
  • చోద్యం చూస్తున్న తెలంగాణ నిర్మాణ సంఘాలు
  • ప‌ట్టించుకోని తెలంగాణ రెరా అథారిటీ
  • ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం మేల్కోవాలి

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌: రెరా అనుమ‌తి లేకుండా.. సుహాస్ ప్రాజెక్ట్స్ రూ.1500 కోట్ల స్కామ్ ను వెలుగులోకి తెచ్చిన రియ‌ల్ ఎస్టేట్ గురు క‌థ‌నంపై తెలంగాణ రెరా అథారిటీ స్పందించింది. ఈ మేర‌కు సుహాస్ ప్రాజెక్ట్స్‌కు తాజాగా నోటీసును జారీ చేసింద‌ని స‌మాచారం. రెరా అనుమ‌తి లేకుండా విక్ర‌యాలు జ‌రిపినందుకు మొత్తం ప్రాజెక్టు విలువ‌లో ప‌ది శాతం జ‌రిమానాను ఎందుకు విధించ‌కూడ‌ద‌ని రెరా అథారిటీ ప్ర‌శ్నించింది. ఈ క్ర‌మంలో సంస్థ త‌ల‌పెట్టిన ప్రాజెక్టు విలువ‌ను మొత్తం లెక్కించ‌గా.. రూ.1500 కోట్లుగా లెక్క తేలింద‌ని తెలిసింది. దీని ప్ర‌కారం, సుహాస్ ప్రాజెక్ట్స్ నుంచి సుమారు రూ.150 కోట్ల జ‌రిమానాను తెలంగాణ రెరా అథారిటీ జ‌రిమానాను వ‌సూలు చేయాలి. మాదాపూర్ కావురి హిల్స్ కేంద్రంగా ప‌ని చేస్తున్న సుహాస్ ప్రాజెక్ట్స్ సంస్థ ఛైర్మ‌న్‌గా సామినేని వెంక‌ట కృష్ణా రావు, ఎండీగా సామినేని సుజాతలు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

బ‌య్య‌ర్య‌దే త‌ప్పు!

రేటు త‌క్కువ‌నే ఒకే ఒక్క అంశం ఆధారంగా బ‌య్య‌ర్లు ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను కొంటున్నారు. అంతేత‌ప్ప‌, ఆయా డెవ‌ల‌ప‌ర్ గ‌త చ‌రిత్ర‌ను ప‌రిశీలించ‌ట్లేదు. గ‌తంలో ఎన్ని నిర్మాణాల్ని క‌ట్టాడు? స‌కాలంలో అందించాడా? లేదా? అనే అంశాన్ని ప‌ట్టించ‌కోవ‌ట్లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి కొంద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగులు ఒక బృందంగా బ‌స్సుల్లో వ‌చ్చి.. స్థ‌లాన్ని చూసిన వెంట‌నే కొనేస్తున్నారు. ప్ర‌ధానంగా రెవెన్యూ, మున్సిప‌ల్‌, పోలీసు వంటి విభాగాల్లో ప‌ని చేసే ఉద్యోగుల్లో కొంత‌మంది ఇదేవిధంగా ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను కొంటుండ‌టం విశేషం. అంతెందుకు, తెలంగాణ‌కు చెందిన‌ సింగ‌రేణీ ఉద్యోగులూ కొంద‌రు బ‌స్సుల్లో న‌గ‌రానికి విచ్చేసి ప్లాట్లు, ఫ్లాట్ల‌ను కొన్న సంద‌ర్భాలూ ఉన్నాయి. సాహితీ సంస్థ‌లో ఇదే విధంగా కొంత‌మంది పోలీసులు క‌లిసి మాదాపూర్ ప్రాజెక్టులో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేసి అడ్డంగా బుక్క‌య్యార‌ని తెలిసింది.

అనుమ‌తి కోసం 712 మంది!

న‌గ‌రానికి చెందిన ఓ రియ‌ల్ సంస్థ 712 మందికి యూడీఎస్ కింద ఫ్లాట్ల‌ను విక్ర‌యించింది. వారంద‌రికీ యూడీఎస్ స్థ‌లాన్ని రిజిస్ట్రేష‌న్ కూడా చేసింది. ఇందుకోసం ఆయా స‌బ్ రిజిస్ట్రార్ ఎంత సొమ్ము తీసుకున్నాడనే విష‌యాన్ని రియ‌ల్ ఎస్టేట్ గురు వివ‌రాల్ని సేక‌రించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. 2000 చదరపు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం గల ఫామ్ ప్లాట్లను రిజిస్టర్ చేయకూడదని పురపాలక శాఖ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాసింది. దానికి అనుగుణంగా ఆయా శాఖ మెమో కూడా జారీ చేసింది. అయినా, కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు ఇలాంటి నిబంధనల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు యూడీఎస్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఒక ప్రాజెక్టులో సుమారు 712 మంది క‌లిసి స్థ‌లాన్ని కొనుగోలు చేసి.. వారంతా క‌లిసి అపార్టుమెంటును నిర్మించేందుకు అనుమ‌తి కావాలంటూ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మ‌రి, ఇంత‌మంది ఒకేసారి అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేస్తే.. అనుమ‌తిని స్థానిక సంస్థ‌లు మంజూరు చేస్తాయా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ వీరికి గనక అనుమతిని మంజూరు చేస్తే.. అక్రమం కాస్త సక్రమం అవుతుంది. కాబట్టి, ప్రీలాంచ్ ఆగడాలకు అడ్డుకట్ట పడాలంటే ఇలాంటి వాటికి అనుమతిని మంజూరు చేయకూడదు. అనుమతికి దరఖాస్తు చేసుకున్న సంస్థ వివరాల్ని రెరా అథారిటీకి అందజేసి.. జరిమానాను విధించాలని తెలియజేయాలి. ఇలా స్థానిక సంస్థలు కఠినంగా వ్యవహరిస్తేనే.. ప్రీలాంచ్ ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది.

కార్పొరేట్ ఏజెంట్ల చేతుల్లోకి రియాల్టీ?

పది, పదిహేనేళ్ల క్రితం కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కలిసి ఢిల్లీ, నొయిడా, గుర్గావ్ రియాల్టీ మార్కెట్ ని పూర్తిగా ధ్వంసం చేశారు. వీరంతా వందలాది మంది కష్టార్జితాన్ని దోచుకున్నారు. మ‌ధ్యత‌ర‌గ‌తి ఉద్యోగులు సొంతింట్లోకి అడుగు పెట్టక రోడ్డు మీద‌ప‌డ్డారు. అనేక మంది బిల్డర్ల మీద కేసులు నమోదయ్యాయి. బడా బిల్డర్లు జైలుకెళ్లారు. అతిపెద్ద కార్పొరేట్ సంస్థలు మధ్యతరగతి ప్రజల్ని నిట్టనిలువునా ముంచేశాయి. సరిగ్గా అదేవిధంగా, ప్రస్తుతం హైదరాబాద్ రియల్ రంగం రూపాంతరం చెందుతోంది. గత కొంతకాలం నుంచి కార్పొరేట్ ఏజెంట్ల సంఖ్య నగరంలో గణనీయంగా పెరిగింది. వీరంతా క‌లిసి అధిక మార్జిన్ ఇచ్చే బిల్డర్ల ఫ్లాట్లను ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఫలితంగా, నాణ్యతగా నిర్మాణాల్ని చేపట్టే కొందరు డెవలపర్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి వికృత పోక‌డ‌ల కార‌ణంగా కొన్ని బ‌డా నిర్మాణ సంస్థ‌లు ఛానెల్ పార్ట్‌న‌ర్ల‌ను ప్రోత్స‌హించ‌ట్లేదు.

అర్బ‌న్ రైజ్‌కు రెరా అనుమ‌తి ఎలా?

ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన బిల్డ‌ర్లు న‌గ‌రంలోకి రంగ‌ప్ర‌వేశం చేసి.. ఛానెల్ పార్ట‌న‌ర్ల‌ను ఎక్కువ‌గా ప్రోత్స‌హిస్తూ.. ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నారు. ఆత‌ర్వాత వీరు ఎంచ‌క్కా రెరా అనుమ‌తిని కూడా తెచ్చుకుంటున్నారు. ఈ విష‌యం క్రెడాయ్ హైద‌రాబాద్‌, ట్రెడా, టీబీఎఫ్‌, టీడీఎఫ్ వంటి నిర్మాణ సంఘాల‌కూ తెలుసు. అయినా, వీరంతా నిమ్మ‌కు నీరెత్త‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలా ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించే సంస్థ‌ల‌కు నోటీసులిచ్చే ద‌మ్మూ, ధైర్యం ఈ సంఘాల‌కు లేక‌పోవ‌డం దారుణ‌మైన విష‌యం. హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో అమ్మ‌కాలు త‌గ్గిపోయి.. అగాథంలో ప‌డిపోవ‌డానికి.. ఒక ర‌కంగా నిర్మాణ సంఘాల నిష్క్రియాప‌రత్వ‌మో కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు.

క‌ళ్ల ముందే ప్రీలాంచ్లో ఫ్లాట్ల‌ను అమ్మే వారిని నివారించే ధైర్యం కూడా లేక‌పోతే.. వీరు నిర్మాణ సంఘాల్లో ఎందుకున్న‌ట్లో అర్థం కావ‌ట్లేదు. బాచుప‌ల్లిలో అర్బ‌న్ రైజ్ అనే సంస్థ కార్పొరేట్ ఏజెంట్లకు అధిక క‌మిష‌న్‌ని అంద‌జేసి ప్రీలాంచ్‌లో వంద‌లాది ఫ్లాట్ల‌ను విక్ర‌యించింది. ఈ విష‌యం ప్ర‌తిఒక్క‌రికీ తెలుసు. అయినా, ఆయా బిల్డ‌ర్‌ను నిల‌దీయ‌లేక‌పోయారు. ఇందులో రెరా అథారిటీ పాత్ర‌ను త‌ప్పు ప‌ట్టాల్సిందే. అప్ప‌టికే ఈ సంస్థ ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్న విష‌యం తెలిసి కూడా రెరా అనుమ‌తిని ఎలా మంజూరు చేసింది? రెరా అనుమ‌తి లేకుండా ప్రీలాంచ్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించిన సంస్థ‌కు ప్రాజెక్టు విలువ‌లో ప‌ది శాతం జ‌రిమానాను వ‌సూలు చేయాల‌నే సోయి తెలంగాణ రెరా అథారిటీకి లేక‌పోవ‌డం దారుణం. ముక్కుపిండి జ‌రిమానాను వ‌సూలు చేయాల్సిన రెరా అథారిటీ ఎందుకు నిమ్మ‌కు నీరెత్త‌కుండా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప్ర‌జ‌లు ప్రశ్నిస్తున్నారు.

This website uses cookies.