ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను నాలుగు సార్లు సవరించిన తర్వాత గృహ రుణాలు సహా అన్ని రకాల రుణాలపైనా వడ్డీ రేట్లు పెరిగాయి. ఇది రెసిడెన్షియల్ ప్రాపర్టీల డిమాండ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే, అలాంటిది ఏమీ జరగేదని, రెసిడెన్షియల్ ప్రాపర్టీ డిమాండ్ పై ఇది ఎలాంటి ప్రభావం చూపించలేదని నిపుణులు చెబుతున్నారు. ‘ఇటీవల కాలంలో అటు డెలపర్లు ధరలు పెంచారు.
ఇటు ఆర్బీఐ రెపో రేటును పెంచింది. అయినప్పటికీ ఇవేవీ దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల డిమాండ్ పై ప్రభావం చూపించలేదు. ఇళ్ల డిమాండ్ యథాతథంగా కొనసాగుతోంది’ అని అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ చెప్పారు. ప్రస్తుత పండుగ త్రైమాసికంలో కూడా ఇళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ, ఇళ్లకు డిమాండ్ తగ్గకపోవడానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. అవేంటంటే..
- కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండటం అనేది ప్రథమ ప్రాధాన్యంగా మరింది. దీంతో ఇళ్ల ధరలూ పెరిగాయి. మంచి ప్రాపర్టీల్లో పెట్టుబడి పెట్టాలని అనుకోవడమూ ఎక్కువైంది.
- నిజానికి ప్రస్తుతం వడ్డీ రేట్లు పెరిగినా.. ఇది ఆల్ టైం హై మాత్రం కాదు. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 12 శాతం, అంతకంటే ఎక్కువగా వడ్డీ రేట్లు ఉన్నాయి. దీంతో పోలిస్తే ప్రస్తుత వడ్డీ రేట్టు (తొమ్మిది శాతం లోపు) ఎక్కువేం కాదు.
- ద్రవ్యోల్బణం దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిస్తోందని, భారతదేశం ఇందుకు మినహాయింపు కాదని, ఈ నేపథ్యంలో ఇల్లు కొనడానికి ఇదే ఉత్తమ సమయం అని చాలా మంది భావిస్తున్నారు.
- గత ఎనిమిదేళ్లుగా ఇల్లు కొనే స్తోమత పెరిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ స్థాయికి పెరిగింది. ప్రస్తుతం చాలా ఆకర్షణీయంగా కొనసాగుతోంది.