రియల్ రంగంలో పెట్టుబడి పెట్టడం చాలా లాభదాయకమైన నిర్ణయమని చాలాకాలం క్రితమే అందరూ గుర్తించారు. ఈ క్రమంలో ఇందులో అధిక రాబడి ఇచ్చే పెట్టుబడులకు అవకాశం ఉన్నవాటిని పరిశీలిస్తే.. అభివృద్ధి చేసిన ప్లాట్లే (ప్లాటెడ్ డెవలప్ మెంట్స్) ముందు వరుసలో ఉంది. అంతకంతకూ దీనికి ప్రజాదరణ పెరుగుతోంది. నివాస లేదా వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా భూమిని చిన్నచిన్న వ్యక్తిగత ప్లాట్లుగా విభజించి అభివృద్ధి చేయడమే ప్లాటెడ్ డెవలప్ మెంట్. రియల్ మార్కెట్ లోని కొనుగోలుదారులు ఫ్లెక్సిబిలిటీ, కమ్యూనిటీ లివింగ్, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టడం వల్ల వీటి వైపే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. పైగా ఇవి చాలా తక్కువ బడ్జెట్లోనే ఉంటాయి. అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్ ఎందుకుందంటే…
ఇటీవల కాలంలో ప్రజల జీవనశైలి మారింది. దీనికి తగినట్టుగానే ఇంటి ఎంపికలో ప్రాధాన్యతలూ మారాయి. ప్రకృతి సామీప్యాన్ని.. అదే సమయంలో గోప్యతను అందించే పెద్ద నివాస స్థలాల కోసమే ఎక్కువ మంది చూస్తున్నారు. ప్రశాంతమైన, బాగా కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలో విశాలమైన ప్లాట్ల ద్వారా ఇవి సాధ్యమవుతాయి. అందుకు ప్లాట్ల అభివృద్ధే ఏకైక మార్గం. అంతేకాకుండా స్థిరమైన జీవితం పట్ల పెరుగుతున్న మొగ్గు, పచ్చని ప్రదేశాల అవసరం, కమ్యూనిటీ లివింగ్ వంటివి ప్లాటెడ్ డెవలప్ మెంట్స్ కు మరింత డిమాండ్ పెంచుతున్నాయి.
ప్రపంచ జనాభా పెరుగుతున్నందున సరసమైన, ప్రణాళికాబద్ధమైన నివాస స్థలాల అవసరం చాలా కీలకమైంది. పైగా తక్కువ ప్రారంభ పెట్టుబడి.. అధిక రాబడిని అందిస్తుంది. హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ఉండే కమ్యూనిటీ సెంటర్లు, ఓపెన్ జిమ్స్, మెడిటేషన్ ప్రాంతాలు, వాణిజ్య ప్లాజాల వంటి సమస్త సౌకర్యాలూ ఇప్పుడు ప్లాటెడ్ డెవలప్ మెంట్స్ లోనూ కనిపిస్తున్నాయి. దీంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. తద్వారా ఇందులో పెట్టబడులు పెట్టేవారికి అధిక రాబడి వస్తుంది.
ప్లాటెడ్ డెవలప్ మెంట్స్ అనవి పెట్టుబడిదారులకు కస్టమైజేషన్, ఫ్లెక్సిబిలిటీ వంటి ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తాయి. అపార్ట్ మెంట్లు లేదా కండోమినియంల వంటి సంప్రదాయ ఎంపికల్లా కాకుండా ప్లాటెడ్ డెవలప్ మెంట్స్ కొనుగోలుదారులకు వారి వారి ప్రాధాన్యతల ప్రకారం తమ కలల గృహాలు నిర్మించుకోవడానికి దోహదపడతాయి. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకునే స్వేచ్ఛను కలిగిస్తాయి. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఆస్తిని రూపొందించుకుంటే దాని మార్కెట్ విలువ కూడా పెరుగుతుంది. అందువల్లే ఇది లాభదాయకమైన పెట్టుబడి అవకాశంగా మారింది.
ఒకరి పెట్టుబడి పోర్టిఫోలియోను వైవిధ్యపరచడానికి ప్లాటెడ్ డెవలప్ మెంట్స్ అద్భుతమైన సాధనంగా ఉపయోగపడతాయి. వీటిని చక్కని రియల్ ఎస్టేట్ పెట్టుబడులుగా పరిగణించవచ్చు. ఇవి అదనపు ఆదాయ మార్గాలను అందిస్తాయి. పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ భూమి విలువ కూడా పెరుగుతుంది. ఆ ప్రాంతంలో పాఠశాలలు, ఆస్పత్రులు లేదా వాణిజ్య కేంద్రాల వంటివి వచ్చేవరకు ఆయా ప్లాట్లను ఉంచుకుంటే.. వాటి విలువ ఎన్నో రెట్లు పెరిగి గణనీయమైన ఆదాయం వస్తుంది.
భూమి అనేది ఓ పరిమితమైన వనరు. పట్టణీకరణ అనేది నానాటికీ విస్తరిస్తున్నందున భూమి లభ్యత మరింత పరిమితంగా మారుతుంది. ఇప్పటికే ఉన్న భూమిని చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి, అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఈ కొరతను ప్లాన్డ్ డెవలప్ మెంట్స్ అధిగమిస్తాయి. భూమి పరిమిత సరఫరా, పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ పోకడలు వంటివి ప్లాటెడ్ డెవలప్ మెంట్స్ కు డిమాండ్ పెంచుతున్నాయి.
This website uses cookies.