కొనుగోలుదారుకు తిరిగి ఇవ్వాల్సిన మొత్తం చెల్లించడంలో విఫలమైన డెవలపర్ పై రెరా కన్నెర్ర జేసింది. సదరు డెవలపర్ నెల రోజుల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా కొనుగోలుదారుకు చెల్లించాల్సిన మొత్తాన్ని 10.75 శాతం వార్షిక వడ్డీతో వెంటనే ఇవ్వాలని ఆదేశించింది.
గురుగ్రామ్ లోని సెక్టార్ 89లో ఓ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ఘజియాబాద్ కు చెందిన సోహన్ లాల్ పెట్టుబడి పెట్టారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ ప్రాజెక్టులో 300 చదరపు అడుగుల దుకాణం కొనుగోలు చేశారు. ఇందుకు రూ.26.07 లక్షలు చెల్లించారు. అమ్మకపు ఒప్పందం ప్రకారం 36 నెలలలోపు దుకాణం స్వాధీనం చేయాల్సి ఉంది. నిర్దేశిత కాలావధి తర్వాత దుకాణం స్వాధీనం చేసేవరకు నెలకు రూ.27వేల అద్దె చెల్లిస్తామని ఒప్పందంలో ఉంది. అయితే, అటు దుకాణం స్వాధీనం చేయకపోగా.. నెలనెలా ఇస్తామన్న అద్దె కూడా డెవలపర్ చెల్లించలేదు.
దీంతో విసుగు చెందిన సోహన్ లాల్.. హరియాణా రెరాను ఆశ్రయించారు. 2023 నవంబర్ 15న ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కొనుగోలుదారు చెల్లించిన మొత్తాన్ని 10.75 శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. అయినప్పటికీ, డెవలపర్ స్పందించలేదు. సమన్లను సైతం లెక్కచేయలేదు. దీంతో సోహన్ మళ్లీ రెరాను ఆశ్రయించారు. కేసును పరిశీలించిర రెరా గురుగ్రామ్ బెంచ్.. డెవలపర్ పై ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడంతోపాటు.. నోటీసులకు సైతం స్పందించలేదని పేర్కొంటూ సదరు డెవలపర్ కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. ఫిర్యాదుదారుకు చెల్లించాల్సిన మొత్తాన్ని వడ్డీతో తిరిగి ఇవ్వాలని స్పష్టంచేసింది. ఏప్రిల్ 16న డెవలపర్ ను తమ ముందు హాజరుపరచాలని పోలీసులకు సూచించింది.
This website uses cookies.