రియల్ ఎస్టేట్ రంగానికి 2023 అద్భుతంగా పనిచేసింది. ఆర్థికంగా బలమైన డెవలపర్ల జోరు బాగా కొనసాగింది. మొత్తం 2707 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి 97 ఒప్పందాలు జరిగాయి. రెసిడెన్షియల్ అమ్మకాలు ఊపందుకోవడంతో ఈ భూమిలో దాదాపు 72 శాతం రెసిడెన్షియల్ డెవలప్ మెంట్ కోసమే వినియోగిస్తున్నారు.
2022లో దేశవ్యాప్తంగా 2508 ఎకరాలకు 82 భూ ఒప్పందాలు జరిగాయి. అంటే గత రెండేళ్లలో 5,215 ఎకరాలకు సంబంధించి 179 భూ ఒప్పందాలు జరగాయి. కాగా, 2023లో జరిగిన 97 ఒప్పందాల్లో టైర్-1, 2, 3 నగరాల్లో అభివృద్ధికి సంబంధించి 1945 ఎకరాలకు పైగా 74 ఒప్పందాలు జరిగాయి. 6 వేర్వేరు ఒప్పందాల్లో 564.75 ఎకరాలు పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కుల కోసం జరగ్గా.. 126 ఎకరాలకు సంబంధించి 7 ఒప్పందాలు మిశ్రమ వినియోగ అభివృద్ధి కోసం జరిగాయి. 27.5 ఎకరాలకు సంబంధించి 5 ఒప్పందాలు వాణిజ్య, ఐటీ పార్కుల కోసం జరిగాయి. లావాదేవీల పరిమాణం పరంగా 2023లో ఎక్కువ లావాదేవీలతో అహ్మదాబాద్ అగ్రస్థానంలో ఉంది. అక్కడ భూముల ధరల ఇప్పటికీ అత్యంత సరసమైనవిగా ఉండటం, వాణిజ్య, నివాసాలకు డిమాండ్ పెరుగుతుండటంతో డెవలపర్లు, సంస్థలు అహ్మదాబాద్ వైపు మొగ్గు చూపిస్తున్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి తెలిపారు. హైదరాబాద్ విషయానికి వస్తే.. రెసిడెన్షియల్ డెవలప్ మెంట్ కు సంబంధించి 69.5 ఎకరాలకు 9 వేర్వేరు ఒప్పందాలు జరిగాయి.