Categories: TOP STORIES

ఎన్నారైల వైపు డెవలపర్ల చూపు

  • రూపాయి పతనంతో పెరుగుతున్న
    ఎన్నారైల కొనుగోలు శక్తి
  • వారిని ఆకర్షించేందుకు డెవలపర్ల ప్రయత్నాలు

గత రెండు వారాలుగా మన రూపాయి రికార్డు స్థాయిలో పతనమవుతోంది. ఇది డాలర్లు సంపాదించే ఎన్నారైలకు వరంగా మారుతోంది. ఆర్ బీఐ రెపో రేటును వరసగా పెంచడంతో ఆ మేరకు గృహ రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. ఇది మన రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, పలు కంపెనీల సీఈవోలు, ప్రముఖులు ముంబైలో లగ్జరీ ఇళ్లను కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేస్తూ వాటికి డిమాండ్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ డెవలపర్లు ఎన్నారైలను ఆకర్షించే పనిలో పడ్డారు. రూపాయి పతనంతో డాలర్లు సంపాదిస్తున్న ఎన్నారైల పంట పండుతోంది. వారి కొనుగోలు శక్తి పెరగడంతో డెవలపర్లు వారి చేత ఇక్కడ పెట్టుబడులు పెట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

లగ్జరీ అపార్ట్ మెంట్ల కొనుగోళ్లలో ఎన్నారైల భాగస్వామ్యాన్ని మరింత పెంచడం కోసం రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్.. దుబాయ్, హాంకాంగ్, లండన్ లకు బృందాన్ని కూడా పంపించింది. కాగా, మన దేశ జీడీపీలో రియల్ ఎస్టేట్ వాటా 13 శాతం. ఎన్నారైల ద్వారా ఈ ఏడాది 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇది గతేడాది కంటే 2 బిలియన్ డాలర్లు ఎక్కువ. ఢిల్లీ, బెంగళూరు, ముంబైలు ఎన్నారైలు పెట్టుబడులు పెడుతున్న నగరాల్లో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, దుబాయ్ లలో నివసిస్తున్న ప్రవాసులు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో గరిష్టంగా 11 శాతం వాటా కలిగి ఉన్నారు.

This website uses cookies.