Categories: TOP STORIES

న‌గ‌రంలో త‌గ్గిన.. డిమాండ్‌, స‌ర‌ఫ‌రా!

  • మ్యాజిక్ బ్రిక్స్ తాజా నివేదిక

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇళ్ల డిమాండ్, సరఫరా తగ్గినప్పటికీ, ధరలు మాత్రం పెరిగాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో ఇళ్లకు డిమాండ్ 6.9 శాతం తగ్గింది. అదే సమయంలో సరఫరా కూడా 4.7 శాతం క్షీణించింది. అయితే, సరాసరి ఆస్తుల ధలు మాత్రం 2.7 శాతం మేర పెరిగాయి. ఈ విషయాన్ని మ్యాజిక్ బ్రిక్స్ తాజా నివేదిక వెల్లడించింది. వచ్చే త్రైమాసికంలో ఇళ్ల డిమాండ్ తిరిగి పుంజుకునే అవకాశం ఉంద‌ని తెలియజేసింది.

హైద‌రాబాద్‌లో చదరపు అడుగుకి రూ.5 వేల నుంచి రూ.7500 మధ్య గల మిడ్ సెగ్మెంట్ లో రెసిడెన్షియల్ డిమాండ్ 44 శాతంగా ఉంది. 3 బీహెచ్ కే ఇళ్లకు అత్యధికంగా 45 శాతం డిమాండ్ ఉంది. కానీ సరఫరా మాత్రం 43 శాతమే ఉంది. 2 బీహెచ్ కే యూనిట్లకు 41 శాతం డిమాండ్ ఉండగా.. సరఫరా 43 శాతం ఉంది. 3 బీహెచ్ కే లేదా అంత‌కంటే అధిక విస్తీర్ణమున్న‌ యూనిట్లకు 11 శాతం డిమాండ్ ఉండగా.. సరఫరా 12 శాతం ఉంది. సింగిల్ బెడ్ రూమ్ యూనిట్ల విషయానికి వస్తే 3 శాతం ఉండగా.. సరఫరా 2 శాతమే ఉంది.

డిమాండ్, సరఫరా పరంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి అగ్రశ్రేణి మైక్రో మార్కెట్ గా నిలిచింది. అత్యుత్తమ కనెక్టివిటీ, అత్యంత కీలకమైన, ప్రధాన కంపెనీలు ఇక్కడే ఉండటమే ఇందుకు కారణం. కొండాపూర్, మియాపూర్ లో ఐటీ, కమర్షియల్, రెసిడెన్షియల్ పరంగా మంచి డిమాండ్ ఉంది. కొనుగోలుదారులకు కూడా పెరిగిన ధరల పట్ల అవగాహన ఉందని, అందువల్ల ధరలు మరింత పెరగకముందే పెట్డుబడులు పెట్టాలని భావిస్తున్నారని నివేదిక వెల్లడించింది. ఫలితంగా హైదరాబాద్ రియల్ మార్కెట్ లో రెసిడెన్షియల్ విభాగం పురోగమనం మరింతగా సాగనుందని అంచనా వేసింది. ‘దేశవ్యాప్తంగా నివాస గృహాలకు డిమాండ్ తగ్గింది. దీనికి పలు అంశాలతోపాటు వర్షాకాలం కూడా ఓ కారణం. అయితే, రాబోయే పండగ నెలలను శుభప్రదమైనవిగా కొనుగోలుదారులు భావిస్తుండటం వల్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులుపెరగనున్నాయి. దీంతో డిమాండ్, సరఫరా వేగం కూడా పెరుగుతుంది. ఆకర్షణీయమైన ఆఫర్లు, డీల్స్ తో ఆస్తులు పొందాలనుకునేవారు ఎక్కువగా ఉంటార‌’ని మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ తెలిపారు.

This website uses cookies.