మహారాష్ట్ర తొలి ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ ప్రాజెక్టు.. పలావా సిటీ వాసులకు కల్యాణ్-డొంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) తీపి కబురు అందించింది. ఇప్పటివరకు వారు చెల్లిస్తున్న రెట్టింపు మొత్తం ఆస్తి పన్నులో 66 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక వసతులు, సౌకర్యాల కల్పిస్తున్నందుకు పలావా సిటీ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ఆయా ఇళ్ల యజమానులకు చార్జీలు విధిస్తుండగా.. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ కు పన్నులు కూడా చెల్లించాల్సి వస్తోంది.
అయితే, 2016లో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ లలో రోడ్లు, స్ట్రీట్ లైట్లు, గార్డెన్, మురుగునీటి శుద్ధి వ్యవస్థ, రవాణా వంటి కనీస వసతులు కలిగి ఉంటే ఆ టౌన్ షిప్ వాసులు ఆస్తి పన్నులో 66 శాతం రాయితీకి అర్హులు. అయితే, పలావా సిటీలో ఈ సౌకర్యాలన్నీ ఉన్నప్పటికీ కేడీఎంసీ మాత్రం వారికి ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. దీంతో పలావా సిటీ యజమానులు అటు అసోసియేషన్ కు ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కూడా అన్నీ చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పలావా సిటీ వాసులు కేడీఎంసీ అధికారులతో మాట్లాడటంతో వారికి ఆస్తి పన్నులో 66 శాతం రాయితీ కల్పిస్తే నిర్ణయం తీసుకున్నారు.