ఢిల్లీకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్.. గోవా రియల్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. అక్కడ అల్ట్రా లగ్జరీ విల్లా ప్రాజెక్టును లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరంలో 62 అల్ట్రా లగ్జరీ విల్లాలను నిర్మించనుంది. రీస్ మాగో అనే కొండపై నిర్మించే ఈ విల్లాల ధర రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల మేర ఉండనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ ప్రాజెక్టు లాంచ్ చేయనున్నట్టు డీఎల్ఎఫ్ ఎండీ, సీఎఫ్ఓ అశోక్ త్యాగి తెలిపారు. ఈ ప్రాజెక్టు సైట్ కాండోలిమ్ బీచ్ కు 4 కిలోమీటర్లు, బాగా బీచ్ కు 10 కిలోమీటర్లు, కలాంగుట్ బీచ్ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
‘గత రెండేళ్లుగా రెండో ఇంటి కొనుగోళ్లలో గోవా ప్రముఖ గమ్యస్థానంగా మారింది. ఇందుకు అనుగుణంగా ఉత్తర గోవాలోని రీస్ మాగోస్ లో గేటెడ్ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించాం. ఢిల్లీ-ఎన్సీఆర్ వెలుపల డీఎల్ఎఫ్ కు ఇది తొలి ప్రాజెక్టు అవుతుంది. ఈ సెగ్మెంట్ లో ఇది బెంచ్ మార్క్ సృష్టించడం ఖాయం’ అని డీఎల్ఎఫ్ హోమ్స్ డెవలపర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాశ్ ఓహ్రి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ప్రాధాన్యతల్లో మార్పు గణనీయంగా కనిపిస్తోందని.. ముఖ్యంగా మెట్రోపాలిటన్ ప్రాంతాలకు దూరంగా సహజమైన పరిసరాలలలో ఉండే ఆధునిక హాలిడే హోమ్ లకు డిమాండ్ బాగా పెరిగిందని చెప్పారు.
అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, ప్రవాస భారతీయులు, కార్పరేట్ దిగ్గజాలు ఈ ట్రెండ్ అనుసరిస్తుండటంతో లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్ మునుపెన్నడూ లేనంతగా ఉందని వ్యాఖ్యానించారు. సోత్ బీ అంతర్జాతీయ రియల్టీ లగ్జరీ ఔట్ లుక్ సర్వే ప్రకారం.. దాదాపు 35 శాతం మంది హాలిడే హోమ్ కొనుగోలుదారులు గోవాను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారని తేలింది. యువ నిపుణులు గోవాలోని గేటెడ్ విల్లాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టు సావిల్స్ ఇండియా నివేదికలో వెల్లడైంది. గోవాలో అద్దెలపై రాబడి దాదాపు 5 నుంచి 8 శాతం ఉండగా.. అంజుమ్, అర్పోరా, బాగా, కలాంగుట్, కాండోలిమ్ వంటి గ్రేడ్ ఏ స్థానాల్లోని విల్లా ధరల్లో 22 శాతం మూలధన విలువ పెరిగిందని తేలింది.