ఢిల్లీ నొయిడాలోని ట్విన్ టవర్లను గతవారం కూల్చివేయడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సరికొత్త సందేహం ఏర్పడింది. ఇలాంటి ట్విన్ టవర్లు మన వద్ద ఉన్నాయా?
ఢిల్లీలోని నొయిడాలో నలభై అంతస్తుల్ని నిర్మించాక.. పదేళ్ల పోరాటం తర్వాత నేలమట్టం అయ్యాయి. మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా తయారైంది. ఎందుకంటే, గత మూడేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలు కట్టక ముందే.. డెవలపర్లు ప్రీలాంచ్లో ఫ్లాట్లను అమ్మేశారు. మూడు, నాలుగేళ్లయినా కొన్ని ప్రాజెక్టులే ప్రారంభం కాలేదు. మరికొన్నేమో అనుమతుల దశలో ఉన్నాయి. ఇంకొన్ని సంస్థలు ప్రజల్నుంచి సొమ్ము తీసుకుని.. నిర్మాణాల్ని ప్రారంభించాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాయి. మొత్తానికి, ప్రీలాంచ్‌లో కొన్నవారు రానున్న రోజుల్లో ఇబ్బందులు పడే అవకాశముందని ఘంటాపథంగా చెప్పొచ్చు.
* దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ నిబంధనలు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. అపార్టుమెంట్లను ఆరంభించే బిల్డర్లు అనుమతి తీసుకునేటప్పుడే పది శాతం నిర్మాణ స్థలాన్ని స్థానిక సంస్థకు తనఖా పెడతారు. ఆతర్వాత నిబంధనల మేరకు అపార్టుమెంట్లను నిర్మించారని నిర్థారణకు వచ్చాకే ఆయా స్థలాన్ని స్థానిక సంస్థలు తనఖాను విడుదల చేస్తాయి. కాబట్టి, మన వద్ద నిబంధనలకు విరుద్ధంగా కట్టే నిర్మాణాలు తక్కువే ఉంటాయి. కాకపోతే, స్థానికంగా కొందరేం చేస్తారంటే.. రెండు ప్లాట్లను వేర్వేరుగా అనుమతి తీసుకుని.. వాటిని అపార్టుమెంటుగా కట్టేస్తుంటారు. ఇలాంటి విషయాల్ని స్థానిక సంస్థలు ఆమ్యామ్యాలు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో అధికారులకు లంచాలిచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను తెచ్చుకునే బిల్డర్లు ఉన్నారంటే నమ్మండి.
* స్థలానికి సంబంధించి యాజమాన్య హక్కులు లేకున్నా.. రాజకీయ పలుకుబడితో కొందరు డెవలపర్లు అనుమతుల్ని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి డెవలపర్లతో కొందరు స్థలయజమానులు న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నారు. ఒకవేళ ఈ కేసుల్లో గనక సుప్రీం కోర్టులో ఆయా నిర్మాణ సంస్థలు ఓడిపోతే ట్విన్ టవర్ల తరహాలో కూల్చివేసే పరిస్థితి రావొచ్చు. కాబట్టి, డెవలపర్లు సూపర్ టెక్ తరహాలో మొండిగా ముందుకెళ్లకుండా ఆయా సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిది. లేకపోతే, అనవసరంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి భంగం కలిగే ప్రమాదముంది.
This website uses cookies.