హైదరాబాద్ నగర జనాభా పెరుగుతున్న కొద్దీ నగరం నాలుగు వైపులా విస్తరిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఏర్పాటు చేశారు. తాజాగా హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో 338 కిలోమీటర్ల మేర నగరం చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే ప్రస్తుతం ఉన్న 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ కు అదనంగా మరో రింగు రోడ్డు అవుతుంది. దీంతో హైదరాబాద్ చుట్టూ రెండు రింగు రోడ్లు ఉంటాయన్నమాట. ఇది బహుశా భారతదేశంలోని ఏ మెట్రో నగరానికీ లేని ప్రత్యేకతను మన భాగ్యనగరానికి తీసుకొస్తుంది. అయితే, దీని అవసరాన్ని శాస్త్రీయంగా నిర్ధారించలేదు. ఓఆర్ఆర్ పూర్తయిన పదేళ్లలోపే ఆర్ఆర్ఆర్ నిర్మించడానికి తగిన ఆవశ్యకత కూడా కనిపించట్లేదు. ఓఆర్ఆరే ఇంకా పూర్తిగా వినియోగంలోకి రాలేదు. అలాంటిది, దీనికి 25 కిలోమీటర్ల దూరంలో మరో రింగు రోడ్లు అవసరం అనే మాట ఎంతమాత్రం సమర్థనీయం కాదనే వాదన వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ వల్ల సారవంతమైన వ్యవసాయ భూములు, నిర్మాణాలు, ఇళ్లతో నిండిన జనసాంద్రత కలిగిన గ్రామాలు ప్రభావితమవుతాయి. ఈ ప్రాజెక్టు వల్ల విలువైన వ్యవసాయ భూమిని కోల్పోవాలి. రోడ్డు డిజైన్ లో కాలిబాటలు, క్రాస్ రోడ్డులు, సైకిల్ లేన్లు, వీధి దీపాలు, ఓవర్ హెడ్ బ్రిడ్జిలు, ట్రాఫిక్ లైట్లు, డివైడర్లు లేకపోవడం వల్ల పాదచారులకు ప్రాణాంతకంగా మారుతాయి. ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్ కి ఇరువైపులా నివసించే గ్రామీణ ప్రజలు, పశువులతో సహా వివిధ మార్గాలను, రవాణా పద్ధతులను వినియోగించేవారు తీవ్రంగా ప్రభావితమవుతారు. భూమి, అడవులు, నీటి వ్యవస్థలు, చిత్తడి నేలలు, గడ్డి భూముల పర్యావరణ వ్యవస్థలు, ఇతర సహజ వనరులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అక్కడ భూమిని ఇష్టమొచ్చినట్టు వినియోగిస్తారు కాబట్టి వాయు కాలుష్యం పెరుగుతుంది. 150 కిలోమీటర్ల పరిధిలో ఆహారోత్పత్తి క్రమంగా సున్నాకి పడిపోతుంది. దీని పర్యావసనాలు ఆకలి, పోషకాహారం, భవిష్యత్తు తరంపై ప్రభావం చూపుతాయి. ఓఆర్ఆర్, హైదరాబాద్ ను కలిపే ఇతర రహదారుల విస్తరణ కారణంగా లక్షలాది చెట్లను తొలగించడం.. రోడ్డు నిర్మాణాలకు మట్టి, రాక్ మెటల్ కోసం కొండలు చదును చేయడంతో స్థానిక జలాశయాలు, సహజ ప్రవాహాలు నాశనం అయ్యాయి. ఓఆర్ఆర్ కారణంగా ఎంత నష్టం జరిగిందో అంతకు మించిన నష్టం ఆర్ఆర్ఆర్ తో ఏర్పడుతుంది.
This website uses cookies.