అద్దె ఇల్లైనా, సొంత ఇల్లు అయినా.. పూరి గుడిసైనా, ఖరీదైన బంగళాలైనా.. నివాసయోగ్యమైన ఎలాంటి కట్టడాలైనా వాస్తు నియమ నిబంధనల్ని పాటించాల్సిందే. ఇంట్లో ఉన్నవాళ్ళు అద్దెకున్నారా, స్వంత ఇంటివాళ్ళా లేక కబ్జ్జా చేసి ఉన్నారా వంటి విషయాల్ని వాస్తు గమనించదని గుర్తుంచుకోండి. వాస్తు ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూ ముందుకెళిపోతుందనే విషయాన్ని మర్చిపోకండి.
అపార్ట్ మెంట్ మొత్తం పక్కా వాస్తు పరంగా నిర్మించామని చెబుతుంటారు. ఇది సాధ్యమేనా?
అపార్ట్ మెంట్ మొత్తం పక్కా 100 % వాస్తుపరంగా నిర్మించామని ఈ భూమండలంపై ఎవరు చెప్పినా అది తప్పు అని చెప్పొచ్చు. ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా, ఎంత డబ్బు ఖర్చుపెట్టినా, ఎంత మంచి ప్రదేశంలో కట్టడాలు కట్టినా వంద శాతం వాస్తుపరంగా కట్టడం అసాధ్యం. ఇలా ఎవరు చెప్పినా నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. గత 40 ఏళ్ల నా శాస్త్రీయ పాఠనా అనుభవంలోగానీ, వాస్తవ స్వయం అనుభవంలోగాని వంద శాతం వాస్తు పరమైన కట్టడం అనేది పచ్చి అబద్దం.
ప్రతి ఇంటిలో గదులు ఏ రకంగా ఉంటే మంచిది?
ఏ దిశ ఇల్లయినప్పటికి ఇంటి యజమానులు లేదా వయసు పైబడిన వాళ్ళుకు కానీ ప్లాటు మొత్తానికి నైరుతి భాగంలో పడక గదులు ఏర్పరుచుకోవాలి. రెండో పడకగది వాయువ్యంలో ఏర్పరుచుకోవాలి, పిల్లల కోసం వాయువ్యం దిక్కున ప్రత్యేకమైన గది ఉంటే బాగుంటుంది (బెడ్రూం ఐనా, రీడింగ్ రూమ్ ఐనా లేదా లైబ్రరీ ఐనా). ఇల్లుకట్టిన మొత్తంలో వంటగదిని మొత్తం ప్లాటుకు తూర్పు భాగంలోని ఆగ్నేయం దిశలో ఏర్పాటు చేసుకోవాలి.
తూర్పువైపు ప్రహరీ గోడకు కొంత ఖాళీ స్థలం వదులుకుని కట్టుకోవాలి. ఈశాన్యం వైపున విడిది గదిని లేదా డ్రాయింగ్ రూము కానీ, గెస్ట్ బెడ్ రూము కానీ లేదా చిన్నపిల్లలకు బెడ్ రూములను కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. హాలు ఏర్పరుచుకునే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోని తూర్పు వైపు గదులకు, పడమటి వైపుగదులకు మధ్యలో / ఉత్తరం వైపు గదులకు, దక్షిణం వైపు గదులకు మధ్యలో చతురస్రంగా కానీ లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఏ దిక్కులోనైనా, ఏ రకంగానైనా పెరగటం కానీ తరగటం కాని జరగకూడదు.
– కుమార స్వామి సంగం,
వాస్తు శాస్త్ర నిపుణులు
This website uses cookies.