బైబ్యాక్ స్కీముల్లో పెట్టుబడి పెట్టొద్దని.. అలాంటి స్కీముల్లో మొదట్లో సొమ్ము వచ్చినా.. ఆ తర్వాత మోసపోతారని.. రియల్ ఎస్టేట్ గురు ముందునుంచే చెబుతూనే ఉంది. అయినప్పటికీ, కొందరు ప్రజలు అధిక వడ్డీకి ఆశపడి.. లక్షల రూపాయల్ని అలాంటి మోసపూరిత వెంచర్లలో పెట్టుబడి పెట్టి దారుణంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా, సుమారు 120 మందికి పైగా మోసపోయిన సంఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.
అధిక రాబడి ఇస్తానని సుమారు రూ.24 కోట్లు వసూలు చేసి.. చేతులెత్తేసింది స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్‌ఫ్రా సంస్థ. ఈ కంపెనీ డైరెక్టర్లు అయిన బైరా చంద్ర శేఖర్, వేములపల్లి జాన్వి, గరిమెళ్ల వెంకట అఖిల్ మరియు రెడ్డిపల్లి కృష్ణ చైతన్యను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అరెస్టు చేసింది. నిందితులు పొరుగు రాష్ట్రమైన ఏపీకి చెందినవారు కావడం గమనార్హం.
ఈ సంస్థ వెంచర్లలో రూ.17 లక్షలు పెట్టుబడి పెడితే.. మహబూబ్‌నగర్‌లో రెండు గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని.. ప్రతినెలా రూ.30 వేలు చెల్లిస్తామన్నారు. అంతేకాకుండా, తమ రిజిస్టర్డ్ భూమిలో చందనం మొక్కలు నాటుతామని నిందితులు పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత, 13-15 సంవత్సరాల తర్వాత, చందనం చెట్లను విక్రయిస్తే వచ్చే లాభాల్లో 50 శాతం ఇస్తామని ఆశ చూపెట్టారు. దీంతో ఆశపడిన సుమారు 120 మంది.. స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్‌ఫ్రా సంస్థ చెందిన రియల్టర్ల చేతిలో సొమ్ము పోశారు. నిందితులు కొలేటరల్ సెక్యూరిటీగా పెట్టుబడిదారులకు అవగాహన ఒప్పందం (ఎంఓయు), లీజు డీడ్‌లు మరియు చెక్కులపై సంతకం చేసిచ్చారు.
అయితే, ఆరంభంలో మొదటి కొన్ని నెలలు పెట్టుబడిదారులకు నెలవారీ రాబడిని చెల్లించారు. కానీ తర్వాత తమ హామీలను నిలబెట్టుకోవడంలో విఫలం అవ్వడంతో పాటు.. కార్యాలయాన్ని మూసేసి వారంతా పారిపోయారు. దీంతో పెట్టుబడిదారులు ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగానికి చెందిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.
This website uses cookies.