కొంతమంది ఔత్సాహిక డెవలపర్లు.. ముప్పయ్ అంతస్తుల ఆకాశహర్మ్యంలో ఫ్లాట్లను చదరపు అడుక్కీ రూ.2500 నుంచి రూ.3000కే అంటూ.. డిజిటల్ మీడియాలో ప్రచారం చేస్తూ మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆకట్టుకుంటున్నారు. అయితే, ఇంత తక్కువ రేటుకు ఫ్లాటు వస్తుండటంతో తెలివైన యువత ఏం చేస్తుందో తెలుసా? ఊర్లో స్థలమున్నా.. పొలమ్మున్నా.. అప్పోసొప్పో చేసి.. పర్సనల్ లోన్ తీసుకుని.. అవసరమైతే పీఎఫ్ సొమ్మును మొత్తం ఊడ్చేసి.. వెనకా ముందు చూడకుండా.. అందులో వంద శాతం సొమ్మును ఏకకాలంలో.. ఈ నవ బిల్డర్ల చేతిలో పోస్తున్నారు.
ఎవరైతే మీ వద్దకొచ్చి ఈ స్కీము గురించి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారో.. అతనికి మీరు చెల్లించే సొమ్ములో ఎంతలేదన్నా పది నుంచి ఇరవై శాతం కమిషన్‌గా అందుతుంది. అందుకే, మీతో వంద శాతం సొమ్మును పెట్టుబడిగా పెట్టించేందుకు రకరకాలుగా చెప్పి ఒప్పిస్తుంటారు. కాబట్టి, మీరు అలాంటి వారి మాయలో పడితే అంతే సంగతులు. మీ చేతికి చివరికీ మిగిలేది.. ఏమిటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.
సాధారణంగా ముప్పయ్ అంతస్తుల ఆకాశహర్య్మాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. నిర్మించాలంటే ఎంతలేదన్నా చదరపు అడుక్కీ రూ.4000 నుంచి రూ.4500 దాకా ఖర్చవుతుంది. ప్రాంతాన్ని బట్టి భూమి ధర కొంత మారుతుందనే విషయం తెలిసిందే. అంటే, స్థలానికి ఎంతలేదన్నా చదరపు అడుక్కీకి రూ.1500గా పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం రూ.6000 అవుతుంది. ఇతరత్రా ఖర్చుల విషయానికి వస్తే.. అడ్మిన్ ఎక్స్‌పెన్సెస్ రూ.350.. పబ్లిసిటీ, మార్కెటింగ్ కోసం చదరపు అడుక్కీ రూ.150 దాకా అవుతుంది. ఇక స్ట్రక్చరల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, ల్యాండ్‌సేపింగ్, లయజనింగ్ కోసం చదరపు అడుక్కీ రూ.100 దాకా ఖర్చవుతుంది.
ఫైనాన్స్ కాస్ట్ కనీసం రూ.400 అయినా అవుతుంది. ఎస్కలేషన్ కాస్ట్ ఎంతలేదన్నా రూ.200 దాకా ఖర్చొస్తుంది. అనుమతుల కోసం చదరపు అడుక్కీ కనీసం రూ.200 అయినా అవుతుంది. అంటే, ఓ ముప్పయ్ అంతస్తుల నిర్మాణాన్ని.. స్థలం కొనుగోలు చేసి కట్టేందుకు.. చదరపు అడుక్కీ కనీసం.. రూ.7,400 అవుతుంది. ప్రాంతాన్ని బట్టి భూమి ధర మారుతుందేమో కానీ.. నిర్మాణ వ్యయం, ఇతరత్రా ఖర్చులు దాదాపుగా ఒకేలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మార్కెట్ మెరుగ్గా లేకపోతే, మార్కెటింగ్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టక తప్పదు. ఇంకొన్నిసార్లు అమ్మకాలు సకాలంలో జరగకపోతే.. చెల్లింపులను సకాలంలో జరపలేం. అలాంటప్పుడు, ఫైనాన్స్ కాస్ట్ పెరుగుతుంది. ఈ వ్యయాన్ని కొంత అటూఇటూ అయినా, ఓ 30 అంతస్తుల నిర్మాణానికి సుమారు రూ.7000 దాకా ఖర్చొస్తుంది. ఇంతకంటే తక్కువకు ఎవరైనా విక్రయిస్తున్నాడంటే.. అతను ఆ ప్రాజెక్టును కట్టడనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి, ఇలాంటి వారి వలలో మీరు పడకపోవడమే మంచిది.
This website uses cookies.