Categories: TOP STORIES

20 లక్షలకే విల్లా.. అంటూ ప్రీలాంచ్ మోసం!

హైదరాబాద్ రియల్ రంగంలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. డీటీసీపీ, రెరాల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. రూ.20 లక్షలకే విల్లా అంటూ మధ్యతరగతి ప్రజలకు ఎర వేస్తున్నారు. పైగా, ఈ అవకాశం కేవలం రెండు వారాలేనని.. ఆతర్వాత ఉండదని బుకాయిస్తున్నారు. అసలు సదాశివపేట్ ఎక్కడ? హైదరాబాద్ నుంచి ఎంత దూరం? నగరం నుంచి అక్కడికెళ్లి ఎవరుంటారు? ఒకవేళ అద్దెకిస్తామన్నా.. అక్కడ ఎవరుంటారు? అద్దె ఎంత గిట్టుబాటవుతుంది? కొనుగోలుదారుల నుంచి రూ.20 లక్షలు తీసుకుని రేపొద్దున విల్లాలను కడతారన్న గ్యారెంటీ ఏమిటీ?

రూ.20 లక్షలకే విల్లా అనేది ఎప్పుడైనా.. ఎక్కడైనా విన్నారా? కానీ నిజమని చెబుతున్నారు. ప్రస్తుతం రూ.50 లక్షల విలువైన ఈ విల్లాను ఒకేసారి చెల్లించే వారికి రూ.20 లక్షలకే విల్లా ఇచ్చేస్తారంట. అయితే, ఇక్కడే ఓ తిరకాసు ఉంది. ఈ విల్లాను పూర్తి చేసి మీకు ఇవ్వడానికి కనీసం రెండున్నరేళ్ల సమయం పడుతుందట. జహీరాబాద్ సమీపంలో ఫార్య్చూన్ విలేజ్ పేరుతో వంద ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టినట్టు 46 ఎకర్స్ డాట్ కామ్ సంస్థ ఎండీ ఆడెపు సతీశ్ చెబుతున్నారు. డీటీసీపీ అనుమతి, రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టు అని పేర్కొంటున్నారు. మొత్తం వెయ్యి వీకెండ్ విల్లాలు నిర్మిస్తున్నామని.. కొన్ని విల్లాలకు మాత్రమే రూ.20 లక్షల ధర అని అంటున్నారు.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. మొత్తం 267 చదరపు గజాల స్థలంలో కేవలం వంద గజాల్లో మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తారు. అంటే ఇది చిన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మాత్రమే. కానీ ఏకంగా విల్లానే ఇచ్చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. వంద గజాల్లో ఇల్లు కట్టి, మిగిలిన 167 గజాలు ఫామ్ ఫీల్డ్ గా వదిలి పెడతారన్నమాట. ఒకవేళ ఎవరికైనా ట్రిపుల్ బెడ్ రూమ్, డూప్లెక్స్ కావాలంటే దానికి తగినట్టుగా రేటు ఉంటుంది. కేవలం కొద్దిమందికి మాత్రమే రూ.20 లక్షలకు విల్లా అని ఊదరగొడుతూ అమాయకులను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

వారు చెప్పినట్టే రూ.20 లక్షలు కట్టేసినవారికి ఎలాంటి ఇల్లు కట్టి ఇస్తారో తెలియదు. అసలు నిజంగా కడతారా లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే పలు ప్రీలాంచ్ ఆఫర్లతో వెలుగులోకి వచ్చిన మోసాలు చూశాం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. దీనికి లోన్ సౌకర్యం కూడా ఉందని.. కానీ లోన్ కు వెళితే ధర రూ.40 నుంచి రూ.50 లక్షలు అవుతుందని చెబుతున్నారు. మరి ఈ తిరకాసు ఏమిటో అర్థం కాదు. సో.. ఇలాంటి ప్రచారాలను నమ్మి పెట్టుబడి పెట్టేసి మోసపోకండి. అన్ని వివరాలూ సరి చూసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి.

This website uses cookies.