Categories: TOP STORIES

కలల ఇంటికి.. బీమాతోనే రక్షణ

తక్కువ ప్రీమీయం

ఎక్కువ భరోసా

ప్ర‌తిఒక్క‌రూ త‌ప్ప‌క తీసుకోవాలి

కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో సొంతిల్లు కొనుక్కోవడమే కాదు.. ఆ ఇంటికి బీమాతో రక్షణ పొందాలి. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తో పాటు ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వంటి వాటి నుంచి రక్షణ పొందాలంటే క‌చ్చితంగా మన కలల ఇంటికి బీమా చేయించాల్సిందే.

గృహ‌రుణంతో ఇల్లు కొనుక్కున్న ఇంటి య‌జ‌మాని.. హ‌ఠాత్తుగా ప్రాణాలు కోల్పోయినా.. శాశ్వ‌త అంగ‌వైక‌ల్యం పొందినా.. అగ్నిప్ర‌మాదాలు, దొంగ‌త‌నాలు సంభ‌వించినా.. ఆదుకునేది హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌. అందుకే హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తో పాటు ఇంటికి ప్రతి ఒక్కరు బీమా చేయించుకోవాలి. వివిధ రకాల ప్రమాదాలను నుంచి మన ఇంటిని రక్షించుకునేందుకు మార్కెట్‌లో అనేక రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మన అవసరం, పరిస్థితులను బట్టి మన ఇంటికి ఏది సరిపోతుందనుకుంటే దాన్ని ఎంచుకోవాలి.

మార్కెట్లో అందుబాటులో ఉన్న పాలసీల్లో హోమ్ లోన్ బీమా ప్రధానమైంది. ఇంటి కొనుగోలు కోసం సాధ్యమైనంత వరకు బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు. అందుకే సదరు ఇంటి రుణానికి సంబంధించిన బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలసీ వల్ల గృహ రుణం తీసుకున్న ఇంటి యజమానికి ఆకస్మిక మరణం సంభ‌వించినా, ప్రమాదంలో అంగవైకల్యం చెందినా.. సదరు బీమా ద్వారా మిగిలిన లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ చెల్లిస్తుంది. ఇప్పుడున్న గృహ‌రుణ‌పాలసీల ప్రీమియం మొత్తం లోన్ లో సుమారు ఒక శాతంగా ఉంది. కాబట్టి ఇంటి రుణానికి బీమా చేయించడం పెద్ద భార‌మేమి కాద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఆ తర్వాత సమగ్ర ఇంటి పాలసీ ముఖ్యమైంది. ఇంటికి ఈ బీమా తీసుకుంటే ఇల్లు, అందులో సామగ్రి, ఇంట్లో నివసించే వారికి రక్షణ లభిస్తుంది. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదం, దొంగతనం వంటివి జరిగినప్పుడు ఈ పాలసీ పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఇంటి విలువ, ప్రాంతం, బీమా మొత్తం వంటి అంశాల ఆధారంగా బీమా కవరేజ్ వర్తిస్తుంది. అయితే కావాలని చేసే నష్టానికి మాత్రం బీమా వర్తించదు. ఇంటి నిర్మాణంలో ఉపయోగించే వస్తువుల్లో ఏమైనా తయారీ లోపం ఉండి నష్టం జరిగినా బీమా రాదని నిపుణులు చెబుతున్నారు.

ఇన్యూరెన్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న మరో పాలసీ హోం కంటెంట్‌ ఇన్సూరెన్స్‌. ఇంట్లో ఉన్న సామగ్రి, ఉపకరణాలు, పరికరాలు పోయినా లేక దెబ్బతిన్నా ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. ఆభరణాలతో పాటు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి ఉపకరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా వాటి మార్కెట్‌ ధరను బట్టి బీమా వర్తిస్తుంది.

ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్బాల్లో బీమా కావాలనుకుంటే స్ట్రక్చరల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవచ్చు. దొంగతనాలు, ఉగ్రదాడుల వంటి ప్రమాదాల సమయంలో ఇంటి నిర్మాణానికి ముప్పు వాటిల్లితే ఈ పాలసీ ద్వారా బీమా పొందవచ్చు. పైకప్పు, ఇంటి నేల, కిచెన్‌.. ఇలా ఎక్కడ నిర్మాణం దెబ్బతిన్నా పరిహారం మొత్తం బీమా రూపంలో ఇస్తారు. వాతావరణ మార్పులు, విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ లు సహా ఇతర అవాంఛనీయ సంఘటనల కారణంగా ఈ మధ్య అగ్ని ప్రమాదాలు పెరిగిపోయాయి. అలాంటి ప్రమాదాల నుంచి రక్షించుకునేందుకు ప్రత్యేకంగా అగ్ని ప్రమాద బీమా పాలసీ అందుబాటులో ఉంది. అయితే ఇంటి కోసం ఏ పాలసీ తీసుకున్నా ముందుగా వాటి నియమ నిబంధనలు, ఫీచర్లు, ప్రీమియం వంటి వివరాలను పరిశీలించాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

This website uses cookies.