కన్జర్వేషన్ జోన్‌లో అపార్టుమెంట్లను కట్టేవారిని.. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లో అక్రమ విల్లాల్ని నిర్మించే బిల్డర్లను ఒక్కసారి కదిలిస్తే చాలు.. ఇదిగో ఇలాంటి మాటలే వినిపిస్తాయి. తాము కారణజన్ములమని.. తమని ఎవరేం చేయలేరని.. ఈ ప్రభుత్వాలు తమకో లెక్క కాదని.. కేసీఆర్ అయినా రేవంత్‌రెడ్డి అయినా.. తాము ఈజీగా మేనేజ్ చేస్తామనే రీతిలో.. ఈ ప్రబుద్ధులు ప్రచారం చేస్తుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు, వారి అనుచరగణం తమకు బంధుమిత్రుల్లాంటి వారని.. వారికి కావాల్సింది అందజేస్తే.. తమ వెంటే ఉంటారనే రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తుంటారు. అధికారంలో ఉన్నవారితో ఫోటోలు దిగి.. వారు తమకెంతో క్లోజ్ అనే రీతిలో.. ఉన్నతాధికారుల వద్ద ఫోజులు కొడుతుంటారు. అందుకే ఎంతో దర్జాగా.. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లో అక్రమంగా విల్లాల్ని నిర్మిస్తారు. అవి అక్రమమని తెలిసినా.. ఇక అధికారులేం పట్టించుకుంటారు?
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో.. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లో అక్రమంగా ఎవరెన్ని ఫామ్ హౌజులు కట్టుకున్నా.. అపార్టుమెంట్లను నిర్మించినా.. అటు హెచ్ఎండీఏ కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే, మాజీ సీఎం కేసీఆరే.. ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తామని మాట ఇవ్వడమే అందుకు ప్రధాన కారణం. అంతేకాదు, ట్రిపుల్ వన్ జీవోలోని 3వ పేరాను మార్చివేసి.. కొత్తగా 69 జీవోను విడుదల చేసింది. మరి, ఆ జీవో ప్రస్తుతం వర్తిస్తుందా? లేదా? ఈ అంశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లోని అక్రమంగా నిర్మిస్తున్న విల్లాల పట్ల కాంగ్రెస్ తమ వైఖరిని తెలియజేయాలి. కళ్ల ముందే అక్రమంగా విల్లాల్ని నిర్మిస్తుంటే.. జిల్లా కలెక్టర్, ఆర్‌డీవో, ఎమ్మార్వోలు.. ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు? నిమ్మకు నీరెత్తకుండా ఎందుకు వ్యవహరిస్తున్నారు?
This website uses cookies.