ఇళ్ల కొనుగోలుదారుల్లో మూడు రకాల బయ్యర్లు ఉన్నారు. ఒకరిదేమో సొంతింటి కల. మరొకరిది స్వార్థపూరిత ఆలోచన.. తాము తోపని.. చట్టం తమకు చుట్టమని.. గవర్నమెంట్ తమ చెప్పు చేతుల్లో ఉందనే భ్రమల్లో.. రియాల్టీలో రిస్కీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. మూడో రకమేమో స్టేటస్ సింబల్ కోసం వెంపర్లాట పడుతుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ మూడు రకాల బయ్యర్లకు.. హైదరాబాద్ రియాల్టీలో ఇన్వెస్ట్ చేసి.. ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. వీరంతా ప్రీలాంచ్‌లో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు కొనడమే ఇందుకు ప్రధాన కారణం.
ప్లాటు, ఫ్లాటు, విల్లా.. వీటిలో ఏది కొనాలన్నా మాటలు కాదు. కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు పూర్తి స్థాయి రిసెర్చ్ చేశాకే కొనాలి. గత కొంతకాలంగా హైదరాబాద్ రియాల్టీలో మోసపోయిన కొందరు బయ్యర్లను క్షుణ్నంగా పరిశీలిస్తే.. ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల్నొ కొనే బయ్యర్లను మూడు రకాలుగా వర్గీకరించొచ్చు. మొదట.. అల్పాదాయ, మధ్యతరగతి బయ్యర్లు అయితే.. మరికొందరేమో సెల్‌ఫిష్ ఆలోచనలతో.. తమ సుఖ సంతోషాల కోసం.. పర్యావరణం గురించి కూడా పట్టించుకోకుండా.. ట్రిపుల్ వన్ జీవో వంటి ప్రాంతాల్లో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల్ని కొంటుంటారు. మూడో రకం వ్యక్తులు.. సమాజంలో స్టేటస్ సింబల్ కోసం గోల్ఫ్ ప్లాట్లను సైతం ప్రీలాంచుల్లో కొంటుంటారు. ఇలా హైదరాబాద్‌లో గోల్ఫ్ ప్లాట్లు కొన్నవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లక్షలు పెట్టి ప్లాట్లను కొనుగోలు చేసినా.. అవి రిజిస్టర్ కాక.. ఏం చేయాలో అర్థం కాక.. ఇచ్చిన సొమ్మును వెనక్కి తీసుకోలేక జుట్టు పీక్కుంటున్నారు.
మధ్యతరగతి బయ్యర్లు..
మార్కెట్లో ఉన్న ధర ప్రకారం.. ఫ్లాట్లు కొనలేని వారంతా ఏం చేస్తున్నారంటే.. ఎవరైనా తక్కువ రేటుకే ఫ్లాట్లను ఇస్తామంటే.. ముందు వెనకా చూసుకోకుండా.. అతను కడతాడా లేదా అని అంచనా వేయకుండా.. గుడ్డిగా ముందుకెళ్లి ప్రీలాంచుల్లో ఫ్లాట్లను కొంటున్నారు. తమ కష్టార్జితాన్ని అంతా తీసుకెళ్లి అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆతర్వాత బిల్డర్ ఎప్పుడు కడతాడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఏడాది దాటిన తర్వాత కానీ వీళ్లకు అసలు విషయం అర్థం కావట్లేదు. అప్పుడు బిల్డర్‌ను చేస్ చేయడానికి ప్రయత్నిస్తుంటే.. అతను తప్పించుకోకుండా తిరగడం స్టార్ట్ చేస్తున్నారు. కింది సిబ్బందితో ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తుంటే.. ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. ఇదే విధంగా సాహితీ, జయా గ్రూప్, భువనతేజ వంటి సంస్థల ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను కొనుగోలు చేసి.. ప్రజలు లబోదిబోమంటున్నారు. చేతులు కాలన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇలాంటి వారంతా ప్రభుత్వము, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు.
సెల్‌ఫిష్ బయ్యర్లు..
రెండో రకం బయ్యర్లకు నిబంధనలతో పని ఉండదు. ఉదాహరణకు, ట్రిపుల్ వన్ జీవోలో అక్రమ కట్టడమని తెలిసినా.. అందులో అనుమతులు రావని తెలిసినా.. కొనేస్తున్నారు. వీరంతా చదువుకున్నవారే. బడా బడా వ్యాపారాలు, వృత్తుల్లో ఉన్నవారే. అయినా వీరికి పర్యావరణం గురించి పట్టింపులుండవు. భవిష్యత్తు తరాలు అంధకారమయం అవుతాయనే సోయి వీరికి లేదు. చట్టం తమ చుట్టం అనుకుంటారు. డబ్బుతో ఎలాంటి వారి నోరయినా మూయించొచ్చని భావిస్తారు. ఈ సమాజాన్ని తామెంతో ఉద్దరిస్తున్నామనే అపోహలో ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఇలాంటి వారంతా తామంతా ప్రత్యేకమైన వ్యక్తులుగా భావిస్తుంటారు. ఇలాంటివారి స్వార్థపూరిత తెలివి తక్కువ నిర్ణయం వల్ల.. జంట జలాశయాలు భవిష్యత్తులో.. మురుగు కాసారాలుగా మారిపోయే ప్రమాదం ఉందని తెలుసు. అయినా, తాము సంతోషంగా ఉంటే చాలనే సెల్‌ఫిష్ ఆలోచనలతో .. ధర తక్కువనే ఏకైక కారణంతో.. అక్రమ విల్లాల్ని కొంటున్నారు. అసలు హైదరాబాద్‌లో పర్యావరణాన్ని నాశనం చేసేది ఇలాంటి చదువుకున్న కొనుగోలుదారులేనని గమనించాలి.
ప్రీలాంచుల్లో గోల్ఫ్ ప్లాట్లు!
మూడో రకం బయ్యర్ల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. వీరికి సమాజంలో స్టేటస్ కావాలి. అందుకే, వీరిలో కొంతమంది హైదరాబాద్‌లో ప్రీలాంచుల్లో గోల్ఫ్ ప్లాట్లు కొని అడ్డంగా బుక్కయ్యారు. రేటు తక్కువనే విషయాన్ని చూశారే తప్ప.. బిల్డర్ సేల్ అగ్రిమెంట్ ను పక్కా చూడలేదు. అందులో ఎవరు సంతకాలు పెట్టారో తెలియదు. అసలు వారికి, సంతకం పెట్టే అర్హత ఉందో.. లేదో.. చూడలేదు. కేవలం రేటు తక్కువనే ఏకైక కారణంతో.. ప్రీలాంచ్‌లో గోల్ఫ్ ప్లాట్లు కొని అడ్డంగా బుక్కయ్యారు. వీరిలో కొంతమంది తమ సొమ్మును వెనక్కి ఇవ్వమని బిల్డర్‌ను అడుగుతున్నారని సమాచారం. ఎందుకంటే, ఐదేళ్ల క్రితం గోల్ఫ్ ప్లాట్లను కొనుగోలు చేసినా.. నేటికీ రిజిస్ట్రేషన్ కాకపోవడమే అందుకు ప్రధాన కారణం. లక్షల రూపాయల్ని వెచ్చించిన తర్వాత కూడా ఇలాంటి దుస్థితి ఎదురుకావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల మథనపడుతున్నారు. కాబట్టి, ఇప్పటికైనా ప్రీలాంచుల్లో అక్రమ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు కొనకుండా ఉంటే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావని గుర్తుంచుకోండి.
This website uses cookies.