-
గుట్టుచప్పుడు కాకుండా..
-
అక్రమంగా విల్లాల నిర్మాణం
-
ఒక్కో విల్లా విస్తీర్ణం.. 15000 చ.అ.
-
ధర.. చదరపు అడుక్కీ రూ.15000
-
ఒక్కో విల్లా ధర.. సుమారు 25 కోట్లు?
-
కొన్నవారిలో ఐఏఎస్ అధికారులు?
-
హెచ్ఎండీఏకు ముందే తెలుసు!
-
పెద్దగా పట్టించుకోని గత ప్రభుత్వం
-
కాంగ్రెస్ ప్రభుత్వం కింకర్తవ్యం..
-
అక్రమ విల్లాల్ని కూల్చివేయాలి
-
111 జీవోలో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్
-
మొత్తం గదులు.. 90
-
ప్రతిరోజు గది అద్దె రూ.8000పైమాటే
-
దీని పక్కనే ఇమాజిన్ విల్లాలు
-
అనుమతి ఉంటేనే లోపలికి
ఒక్కసారి ఊహించండి..
కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవో మీద వ్యతిరేకంగా ఉంది. అయినా, గత ప్రభుత్వ హయంలో.. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లో.. కొందరు బిల్డర్లు అక్రమంగా విల్లాల్ని నిర్మించారు. మీరెంతో ముచ్చటపడి అజీజ్‌నగర్ వంటి ఏరియాలో కొన్న అతిపెద్ద విల్లాల్ని హెచ్ఎండీఏ ఒక్కసారిగా నేలమట్టం చేస్తే ఎలా?
ఆలోచించండి..
విల్లాల్నికట్టుకోమని ఇండైరెక్టుగా చెప్పిన హెచ్ఎండీఏ అధికారి.. ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడన్న సంగతి తెలిసిందే.. మరి, అక్రమంగా కట్టిన వ్యక్తికి.. రెరా జరిమానా విధించకుండా ఉంటుందా? కట్టకపోతే జైలుకెళ్లకుండా ఉంటాడా చెప్పండి?
ఐఏఎస్ లు కొంటే వదిలేస్తారా?
గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని కూడా ప్రభుత్వం వదిలిపెట్టే పరిస్థితి కనిపించట్లేదు. అలాంటప్పుడు, ట్రిపుల్ వన్ జీవోలో.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అక్రమంగా విల్లాలు కొన్నా.. ప్రస్తుత ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకున్నా.. వారిని ప్రభుత్వం వదిలివేస్తుందని అనుకుంటున్నారా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో అక్కడక్కడా ఫామ్ హౌజులుండేవి. వేళ్ల మీద లెక్కపెట్టేనన్నీ విల్లా కమ్యూనిటీలుండేవి. అక్కడక్కడా విసిరేసినట్లు కొన్ని రిసార్టులుండేవి. కానీ, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత.. ట్రిపుల్ జీవోను ఎత్తివేస్తామన్న మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల హామీ పుణ్యమా అంటూ.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో.. అక్రమంగా విల్లాల్ని నిర్మించే డెవలపర్ల సంఖ్య పెరిగింది. శాశ్వత నిర్మాణాల్ని నిషేధించిన ఈ ప్రాంతంలో.. నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న నిర్మాణాల నుంచి విడుదలయ్యే మురుగునీరంతా జంటజలాశయాల్లోకి వదిలిపెడుతున్నారు. ఇదే కొనసాగితే కొన్నాళ్ల తర్వాత.. అవి కాస్త కాలుష్య కాసారాలుగా మిగిలిపోతాయి.
ట్రిపుల్ వన్ జీవోలో మొత్తం 84 గ్రామాల్ని ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి తెచ్చారు. అయితే, అందులో మొయినాబాద్, అజీజ్‌నగర్, బాకారం వంటి ప్రాంతాల్లో అక్రమంగా విల్లాల్ని కట్టడం గత ప్రభుత్వంలో ఆనవాయితీగా మారింది. ఈ అక్రమ బిల్డర్లు ఏదో రకంగా హెచ్ఎండీఏను మేనేజ్ చేసి.. ఇష్టారాజ్యంగా విల్లాల్ని నిర్మిస్తున్నారు. తామేం చేసినా చెల్లుతుందనే ధోరణీలో అధికారులూ వ్యవహరించేవారు. తామేం చెప్పినా ప్రభుత్వం వింటుందనే ఉద్దేశ్యంతో.. ఎన్ని అక్రమ విల్లాల్ని కట్టినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. మరి, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో అక్రమంగా విల్లాల్ని కట్టేవారిని ఎలా దారిలోకి తెస్తుంది?
15000 చ.అ.లో విల్లా..
ఇమాజిన్ విల్లా కమ్యూనిటీ బ్రోచర్‌ను చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఏ వరల్డ్ ఆఫ్ పాజిబిలిటీస్ అంటూ డిజైన్ చేసిన ఈ బడా సైజ్ బ్రోచర్‌ను చూస్తే షాక్ అవ్వాల్సిందే. అక్రమంగా కడుతున్న ఈ ఇమాజిన్ విల్లాస్‌లో.. అసాధ్యమనుకున్న అనేక ఫీచర్లను అందజేస్తున్నట్లు డ్రీమ్ వ్యాలీ ఇందులో పొందుపర్చింది. ఇందులో ఒక్కో విల్లాను సుమారు పదిహేను చదరపు అడుగుల్లో నిర్మిస్తోంది. ధర విషయానికి వస్తే.. చదరపు అడుక్కీ రూ.15 వేలుగా ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. అంటే, ధర దాదాపు రూ.22.50 కోట్ల దాకా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇందులో ఎంతలేదన్నా 40కి పైగా విల్లాల్ని కడుతున్నారని సమాచారం. అంటే, ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో.. ఈ ఒక్క ప్రాజెక్టు అమ్మకపు విలువ.. అన్నీ కలుపుకుంటే వెయ్యి కోట్లు దాకా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
- ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో.. అక్రమంగా నిర్మించే విల్లాల్లో.. ఏ ప్రజాప్రతినిధి అయినా.. ఐఏఎస్ అధికారి అయినా.. కొనుగోలు చేసినా.. అందులో నివసిస్తున్నా.. ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తుందా?
- ప్రకృతికి వ్యతిరేకంగా నిబంధనల్ని తుంగలో తొక్కి.. గుట్టుచప్పుడు కాకుండా.. జంటజలాశయాల్ని మురికికూపంగా మార్చేస్తుంటే.. ప్రభుత్వం నిద్రపోతుందా?
- ఎవరేం కట్టినా.. తమ వాటాలు వస్తే చాలన్న రీతిగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తారా? అందులో ఫ్రీగానో లేక తక్కువ రేటుకో విల్లా ఇస్తే అధికారులు పట్టించుకోకుండా ఉంటారా?