దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు బాగానే సాగుతున్నాయి. గత ఐదేళ్లుగా అమ్ముడుపోని ఇళ్ల ఇన్వెంటరీ తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్ లలో 57 శాతం మేర తగ్గింది. కోల్ కతాలో ఇది 41 శాతం క్షీణించగా.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో 11 శాతం మేర తగ్గుదల నమోదైంది. ముంబై, పుణెల్లో 8 శాతం మేర తగ్గాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ నివేదిక వెల్లడించింది. కొనుగోలుదారుల సెంటిమెంట్ స్థిరంగా కొనసాగుతుండటంతో, కరోనా తర్వాత సొంతింటి కొనుగోలు పట్ల ఎక్కువ మందిలో ఆసక్తి పెరగడం వంటి అంశాలు ఇళ్ల డిమాండ్ కు కారణాలు. ఓవైపు కొత్త లాంచ్ లు బాగానే ఉన్నప్పటికీ, కొనుగోలుదారుల్లో విశ్వాసం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
* ఢిల్లీలో 2018 తొలి త్రైమాసికం ముగిసే నాటికి 2,00,476 అమ్ముడుపోని ఇళ్లు ఉండగా.. 2024 క్యూ1 ముగిసే సమయానికి 57 శాతం తగ్గి 86,420 యూనిట్లకు చేరింది. ఇక దక్షిణాన బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల్లో 2018లో 1,96,406 అమ్ముడుపోని ఇళ్లు ఉండగా.. 2024లో 1,75,520 యూనిట్లకు తగ్గింది. మంబై, పుణెల్లో 3,13,405 యూనిట్ల నుంచి 2,89,677 యూనిట్లకు తగ్గింది. కోల్ కతాలో 49,560 ఇళ్ల నుంచి 29,278 ఇళ్లకు చేరింది.