సర్టిఫికెట్లు పొందని ఏజెంట్ల రిజిస్ట్రేషన్
ఏడాదిపాటు నిలిపివేస్తూ రెరా నిర్ణయం
నిర్దేశించిన సర్టిఫికెట్ పొందని రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై రెరా కన్నెర్ర జేసింది. దాదాపు 20వేల మంది రిజిస్ట్రేషన్ ను ఏడాదిపాటు నిలిపివేస్తూ మహారాష్ట్ర రెరా నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి ఒకటి నుంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు శిక్షణ తరగతులకు హాజరై, పరీక్ష రాసి సర్టిఫికెట్ పొందాలని రెరా పేర్కొంది. ఇందుకోసం వారికి కొంత గడువు ఇచ్చింది. అయితే, చాలామంది దీనిని పట్టించుకోలేదు. దీంతో 20వేల మంది ఏజెంట్ల రిజిస్ట్రేషన్ ను ఏడాదిపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వారు ఈ ఏడాదిపాటు ఎలాంటి రియల్ కార్యకలాపాలూ చేయకూడదు. మహారాష్ట్రలో దాదాపు 47వేల మంది రెరాలో నమోదు చేసుకోగా.. వారిలో 20వేల మంది ఇకపై ఎలాంటి బిజినెస్ చేయకూడదు. అంటే.. దాదాపు 42 శాతం మంది ఈ ఏడాది రియల్ విధులకు దూరంగా ఉండాల్సిందే. వీరు రెరా నిర్దేశించిన శిక్షణ పొంది, పరీక్ష రాసి సర్టిఫికెట్ పొంది పోర్టల్ అప్ లోడ్ చేసిన తర్వాత వారి లైసెన్స్ పునరుద్ధరిస్తారు.