తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ ఎగుమతుల్లో దేశంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. ఇక్రిశాట్ సేవల్ని విరివిగా వినియోగించుకుని.. పట్టణాల్లో నివసించే మహిళలకు ఆర్థిక చేయూతనివ్వాలని అనుకున్నారు. ఇందుకోసం పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ కార్యచరణలోకి దిగారు. ఇక్రిశాట్ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సమాచారం. అగ్రి బిజినెస్ మరియు అగ్రి మార్కెటింగ్‌లో అవకాశాల్ని కల్పించి.. పట్టణాల్లోని మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఆర్థికంగా బలోపేతం చేయాలని భావించారు.
పురపాలక శాఖ పరిధిలో పని చేసే హెచ్ఎండీఏ, నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆప్ అర్బన్ మేనేజ్‌మెంట్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఏపీఈడీఏ విభాగాలకు ఇక్రిశాట్ సాంకేతిక సహాయాన్ని అందజేస్తుందని తెలిసింది. ఏయే వ్యవసాయ ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంది? వాటిని ఎలా పండించాలి?ఏయే కాలంలో పండించాలి? ఇదివరకే రైతులు పండించిన ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలి?.. ఇలాంటి అనేక అంశాలపై ఇక్రిశాట్ స్వయం సహాయక బృందాలకు అవగాహన కల్పిస్తుందని సమాచారం. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, మార్కెటింగ్ అవకాశాల్ని కల్పించి హెచ్ఎండీఏ పరిధిలో ఎక్స్‌పోర్ట్ హబ్స్‌ను ఏర్పాటు చేయడానికి పురపాలక శాఖ సమాయత్తం అవుతుందని తెలిసింది.
ఇక్రిశాట్ ప్రత్యేకత..
1972లో పటాన్‌చెరులో ఆరంభమైన ఇక్రిశాట్ 3500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలోని పదిహేను అత్యుత్తమ పంటల పరిశోధన సంస్థల్లో ఇక్రిశాట్ ఒకటి. ఏషియా మరియు ఆఫ్రికా దేశాల్లో పంటలపై పూర్తి స్థాయి పరిశోధనలు చేసే సంస్థల్లో ప్రముఖమైనది. పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికాలోని నైగర్, సౌతాఫ్రికాలోని కెన్యా వంటి దేశాల్లో రీజినల్ హబ్స్ కూడా ఉన్నాయి. ప్రపంచంలో పేదరికం మరియు ఆకలి సమస్యలను అధిగమించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచడంతో పాటు వాటిని స్థిరీకరించేలా చేయడమే కాకుండా వ్యవసాయ వ్యవస్థలనూ అభివృద్ధి చేస్తుంది. మొత్తానికి, ప్రపంచ ఆకలిని తీర్చేందుకు 1972 నుంచి కృషి చేస్తున్న ఇక్రిశాట్ ద్వారా.. మన తెలంగాణ పట్టణ మహిళలకు ఆర్థిక స్వాలంబనను చేకూర్చాలన్న మంచి ఆలోచనను మనమంతా హర్షించాల్సిందే.