దేశవ్యాప్తంగా ఇళ్లకు డిమాండ్ ఉండటమే కారణం
జేఎల్ఎల్ నివేదిక వెల్లడి
దేశవ్యాప్తంగా ఇళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అమ్ముడవ్వని ఇళ్ల ఇన్వెంటరీని విక్రయించే సమయం తగ్గింది. గత ఎనిమిది త్రైమాసికాల్లో ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్ కతాల్లోని విశ్లేషణల ఆధారంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ ఓ నివేదిక విడుదల చేసింది. 2019 చివరి నాటికి ఉన్న సమయంతో పోలిస్తే.. మూడింట ఒక వంతు తగ్గి 22 నెలలకు చేరింది. ధరల శ్రేణి పరంగా చూస్తే.. రూ.కోటిన్నర నుంచి రూ.3 కోట్ల మధ్య విలువ కలిగిన ప్రీమియం విభాగం అత్యధికంగా విక్రయ సమయం తగ్గిందని జేఎల్ఎల్ పేర్కొంది. 2019 డిసెంబర్ తో పోలిస్తే.. 51 నెలల్లో ఈ విక్రయ సమయం 43 శాతం తగ్గి 29 నెలలకే చేరింది. దీని తర్వాత రూ.75 లక్షల వరకు ధర కలిగిన అందుబాటు ఇళ్ల విక్రయ సమయంలో 40 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈ విభాగంలో అమ్ముడవ్వని ఇన్వెంటరీని ఇప్పుడు 19 నెలల్లో క్లియర్ చేసుకోవచ్చు.
గత నాలుగు సంవత్సరాలుగా అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో కొత్త లాంచ్ లలో వాటా తగ్గినప్పటికీ, మరోవైపు ప్రీమియం సెగ్మెంట్ వార్షిక లాంచ్ ల వాటా గణనీయంగా పెరిగినప్పటికీ.. ప్రీమియం సెగ్మెంట్ ఇన్వెంటరీ విక్రయ సమయంలో 22 శాతానికి తగ్గిందని వివరించింది. అలాగే రూ.75 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర కలిగిన ఇళ్ల విక్రయ సమయం కూడా 27.5 శాతం తగ్గి 29 నెలల నుంచి 21 నెలలకు తగ్గింది. రూ.కోటి నుంచి రూ.కోటిన్నర మధ్య ధర కలిగిన ఇళ్ల విక్రయ సమయంలో 26.4 శాతం తగ్గగా.. రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఉన్న ఇళ్ల విక్రయ సమయం 11 శాతం మేర తగ్గింది. నగరాలవారీగా చూస్తే.. బెంగళూరులో అమ్ముడుపోని ఇళ్ల ఇన్వెంటరీ 13 నెలల్లో విక్రయం అవుతాయి. ఢిల్లీలో ఇళ్ల విక్రయానికి 14 నెలలు, కోల్ కతాలో ఇళ్ల విక్రయానికి 15 నెలల సమయం పడుతుంది. ఢిల్లీలో తొలుత ఇది 48 నెలలు ఉండగా.. ప్రస్తుతం అది 14 నెలలకు తగ్గినట్టు జేఎల్ఎల్ పేర్కొంది.