రియల్ రంగంలో పెట్టుబడులు పెడుతున్న మహిళలు క్రమంగా పెరుగుతున్నారు. ఇది దేశంలో మారుతున్న సామాజిక చైతన్యానికి నిదర్శనమే కాకుండా మహిళల ఆర్థిక స్వాతంత్యానికి ఓ సూచిక కూడా. ఎక్కువ మంది మహిళలు సొంతింటి కొనుగోలుకే మొగ్గు చూపిస్తున్నారు. అవి కూడా సరసమైన, సురక్షితమైన, స్థిరమైన, పర్యావరణ అనుకూలమైనవిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రియల్ పరిశ్రమ నుంచి సైతం వారికి చక్కని ప్రోత్సాహం లభిస్తోంది. మహిళా కొనుగోలుదారుల కోసం అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నారు. వాటిలో కొన్ని వివరాలివీ..
మహిళా కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు పన్ను ప్రయోజనాలను అందిస్తోంది. ఇది రియల్ రంగంలో మహిళలు మరింతగా పెట్టుబడులు పెట్టడానికి, అలాగే గృహ నిర్మాణ రంగంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతోంది.
స్టాంపు డ్యూటీ అనేది ఆస్తి కొనుగోలుపై విధించే పన్ను. మహిళా కొనుగోలుదారులకు ఇందులో మినహాయింపు కల్పిస్తున్నారు. తద్వారా ఇంటి కొనుగోలు ఖర్చు కొంత వరకు తగ్గుతుంది. దేశంలోని అనేక రాష్ట్రాలు స్టాంపు డ్యూటీని ఒక శాతం నుంచి 2 శాతం మధ్య ఇస్తుండగా.. కొన్ని రాష్ట్రాలు ఇందులో రాయితీ ఇస్తున్నాయి.
ఓ ఆస్తికి స్త్రీ సహ యజమానికి అయితే, ఆమెకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనం పొందుతారు. ఈ విభాగం కింద హోమ్ లోన్ అసలు మొత్తంపై రూ.లక్షన్నర వరకు తగ్గింపు లభిస్తుంది.
అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మహిళలకు తక్కువ వడ్డీ రేట్లతో గృహ రుణాలను అందిస్తున్నాయి. తద్వారా వారు ఇంటిని కొనుగోలు చేసేలా చేస్తున్నాయి. దీంతోపాటు హోమ్ లోన్ పై చెల్లించి వడ్డీపై రూ.2 లక్షల వరకు సెక్షన్ 24బి కింద మినహాయింపు పొందవచ్చు.
ఓ స్త్రీ ఆస్తిని విక్రయించి మూలధన లాభం పొందినట్టయితే, ఆమె ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ రెండేళ్లలోపు మరో రెసిడెన్షియల్ ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టి, ఆ ఆస్తిని విక్రయించగా వచ్చే మూలధన లాభాలపై కూడా పన్ను మినహాయింపు అందిస్తుంది. ఇది లింగబేధంతో సంబంధం లేకుండా పన్ను చెల్లింపుదారులందరికీ వర్తిస్తుంది.
భారత ప్రభుత్వం మహిళా గృహ కొనుగోలుదారులకు సబ్సిడీలు, రుణాలను అందిస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ పథకం కింద ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాల మహిళలకు ఇల్లు కొనడానికి రూ.2.67 లక్షల వరకు సబ్సిడీ ఇస్తోంది.
This website uses cookies.