Categories: LEGAL

దుబాయ్ పారిపోతుండ‌గా ప‌ట్టివేత‌!

  • సాహితీ ఇన్ ఫ్రా డైరెక్టర్ సాత్విక్ అరెస్టు

ప్రీలాంచ్ ఆఫర్ తో వందలాది మంది నుంచి దాదాపు రూ.900 కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేసులో సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ కుమారుడు బూదాటి సాత్విక్ ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సాత్విక్ ను శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి పోలీసులకు అప్పగించారు.

నిర్మాణాలు చేపట్టక ముందే తక్కువ ధరకు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్ ఇస్తామంటూ సాహితీ ఇన్ ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఎండీ లక్ష్మీనారాయణ ప్రీలాంచ్ ఆఫర్ తో భారీ మోసానికి తెగబడ్డారు. అమీన్ పూర్ లోని 23 ఎకరాల్లో సాహితీ శ్రావణి ఎలైట్ పేరుతో 38 అంతస్తుల్లో హైరైజ్ అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నామని ప్రకటనలు గుప్పించారు. 1200 చదరపు అడుగుల నుంచి 1700 చదరపు అడుగుల్లో 2 బీహెచ్ కే, 3 బీహెచ్ కే ఫ్లాట్లు నిర్మిస్తున్నామని.. ప్రీలాంచ్ ఆఫర్లో భాగంగా తక్కువకే విక్రయిస్తున్నామని పలువురిని నమ్మించారు. తద్వారా దాదాపు 2500 మంది నుంచి రూ.900 కోట్లు వసూలు చేశారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా ఫ్లాట్లు నిర్మించి ఇవ్వకపోవడంతో కొనుగోలుదారులు లక్ష్మీనారాయణపై ఒత్తిడి చేశారు.

దీంతో వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా ఇచ్చేస్తానని చెప్పి కొందరికి చెక్కులు ఇచ్చారు. కానీ అవి బౌన్స్ కావడంతో వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గతేడేది డిసెంబర్ 3న లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. ఆయన కుమారుడు సాహితీ సంస్థ డైరెక్టర్ సాత్విక్ పై లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భార్యతో కలిసి దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించిన సాత్విక్ ను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.

This website uses cookies.