Categories: LATEST UPDATES

అందుబాటు గృహాలపై వ‌డ్డీ రేట్ల దెబ్బ..

    • అమ్మకాలు తగ్గే అవకాశం

పెరుగుతున్న తనఖా రేట్లు సరసమైన (రూ.50 లక్షల లోపు విలువైన ఇళ్లు), మధ్యస్థ గృహాల (రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్యలో)పై తీవ్ర ప్రభావం చూపిస్తాయని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రూ.కోటి కంటే ఎక్కువ విలువైన ఇళ్లతో కూడిన లగ్జరీ మార్కెట్ డిమాండ్ బాగుంటుందని పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే.. సరసమైన, మధ్యస్థ గృహాల మార్కెట్ 10 శాతం నుంచి 15 శాతం మేర తగ్గే అవకాశం ఉందని అంచనా. కోవిడ్ ప్రభావిత 2021 కంటే గతేడాది ఈ సెగ్మెంట్ వృద్ధి 35 నుంచి 40 శాతం ఉండటం గమనార్హం. కానీ ఈ ఏడాది మాత్రం అది తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. అయితే, సూపర్ లగ్జరీ ప్రాపర్టీ అమ్మకాలు మాత్రం గణనీయంగా పెరుగుతాయని.. డిమాండ్ కు తగిన సరఫరా లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు.

గతనెలలో ముంబైలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1102 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఏకంగా 79 శాతం ఎక్కువ. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగినప్పటికీ, వాటి లావాదేవీల సంఖ్య తగ్గడం గమనించాల్సిన అంశం. అంటే.. రిజిస్ట్రేషన్లు అన్నీ ఎక్కువ విలువ కలిగిన ఇళ్లవే అని అర్థమవుతోంది. గతేడాది ఏడు ప్రధాన నగరాల్లో మొత్తం 3.65 లక్షల యూనిట్లు విక్రయమవగా.. అందులో దాదాపు 18 శాతం (65,680) లగ్జరీ (రూ.కోటిన్నర పైబడిన) కేటగిరీవే. 2019లో ఇది కేవలం 7 శాతం మాత్రమే. తనఖా రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో సరసమైన, మధ్యస్థ గృహాలు కొనేవారు వెనకడుగు వేసే అవకాశం ఉన్నందున ఆయా కేటగిరీల అమ్మకాలు తగ్గుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నందున వాటి అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి ఉంటుందని చెబుతున్నారు.

This website uses cookies.