ఏపీలో గృహ నిర్మాణ పథకం లబ్దిదారులకు విద్యుత్ ఆదా చేసే దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చక్కని నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలోని లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, విద్యుత్ ఆదా చేసే సామర్థ్యం కలిగిన రెండు ఫ్యాన్లను మార్కెట్ ధర కంటే తక్కువకే అందజేయాలని నిర్ణయించింది. ఏపీలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింది 21.25 ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు 93 శాతం ఇళ్ల పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 7,630 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ లబ్ధిదారులకు విద్యుత్ ఆదా చేసే ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు తక్కువ ధరకే ఇప్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆ సంస్థ 6 లక్షల ఎల్ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్లను తొలి దశ జగనన్న కాలనీ లబ్ధిదారులకు సరఫరా చేయనుంది. వీటి వినియోగం వల్ల ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా. తద్వారా మొత్తం 15.6 లక్షల ఇళ్లలో ఏడాదికి దాదాపు రూ.352 కోట్ల విలువైన 1145 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా కానుంది.