ఈఐపీఎల్ శ్రీధర్ రెడ్డి పై కూడా
42 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ విక్రయం నేపథ్యంలో విచారణ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తహశీల్దార్ ఆర్.పి.జ్యోతితోపాటు ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్స్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 107, 120, 166-ఏ, 405, 409, 415, 424, 425, 464, 420 రెడ్ విత్ సెక్షన్ 34 కింద, రిజిస్ట్రేషన్ చట్టంలోని 81, 82 కింద విచారణ జరపాలని మహేశ్వరం పోలీసులను రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశించింది. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని 181 సర్వే నెంబర్ లోని కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమికి అక్రమంగా విక్రయించి బదిలీ చేసినందుకు ఈ మేరకు విచారణ చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ ఏడాది మార్చి 15న 12వ అదనపు మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కేవలం ఐపీసీ 420, 166, సీఆర్ పీసీ 156(2) కింద మాత్రమే కేసు నమోదైంది. అయితే, ఈ వ్యవహారంలో ఇతర నేరాలు చాలా ఉన్నాయని, దాదాపు పదేళ్ల వరకు శిక్ష పడే అవకతవకలకు పాల్పడ్డారని జిల్లా కోర్టు నిర్ధారించింది. ఈ అంశాలేవీ జూనియర్ కోర్టు ఆదేశాల్లో లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో తహశీల్దార్ జ్యోతి, ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్స్ అధినేత శ్రీధర్ రెడ్డిపై విచారణ జరపాలని మహేశ్వరం పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. కాగా, ఆ కేసులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.