poulomi avante poulomi avante

ప్రీలాంచుల నియంత్రణకు కాల్ సెంట‌ర్ ఏర్పాటు?

  • ప్రీలాంచుల్లో అమ్మేవారు నిర్మాణాలు పూర్తి చేయ‌లేరు
  • అనుభ‌వం లేనివారు ఆకాశ‌హ‌ర్మ్యాల్ని ఎలా క‌డ‌తారు?
  • యూడీఎస్‌లో కొన్న‌వారికి బిల్డ‌రుతో పాటు జైలుశిక్ష‌!
  • యూడీఎస్ రిజిస్ట్రేష‌న్లు నిలిపివేయాలి
  • అనుమ‌తి స‌మ‌యంలోనే రెరా నిబంధ‌నలు

( కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌)

హైద‌రాబాద్‌లోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప‌రిధిలో ప్ర‌తిఏటా దాదాపు వంద కంటే అధిక సంఖ్య‌లో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల నిర్మాణం జ‌రుగుతోంది. ఒక ప్రాంతానికి గ‌ల గిరాకీని అంచ‌నా వేసి.. డెవ‌ల‌ప‌ర్లు ఎన్ని అంత‌స్తులు క‌ట్టాల‌నే విష‌యంలో తుది ఆలోచ‌న‌కు వ‌చ్చాకే.. బిల్డ‌ర్లు నిర్మాణాలు చేప‌డ‌తారు. ఇందుకు గాను జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏ నుంచి అనుమ‌తి తీసుకుంటారు. రెరా అథారిటీ వ‌ద్ద న‌మోదు చేసుకున్నాకే అమ్మ‌కాలూ చేప‌డ‌తారు. ఇది కొన్నేళ్లుగా న‌గ‌ర నిర్మాణంలో జ‌రుగుతున్న అతి సాధార‌ణ ప్ర‌క్రియ‌. కాక‌పోతే, ఇటీవ‌ల కాలంలో కొంద‌రు బిల్డ‌ర్లు స్థానిక సంస్థ‌ల నుంచి అనుమ‌తి తీసుకోకుండానే యూడీఎస్ (అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్‌), ప్రీలాంచ్‌, ప్రీసేల్ ఆఫ‌ర్లంటూ అమ్మ‌కాల్ని చేప‌డుతున్నారు. దీంతో కొనుగోలుదారుల్లోనూ గంద‌ర‌గోళం ఏర్ప‌డుతోంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం క‌ట్టే అపార్టుమెంట్‌లో ఎక్కువ రేటు పెట్టి కొనాలా? అంత‌కంటే సగం రేటుకే ప్రీలాంచ్‌లో కొనాలా? అనే సందేహాల మ‌ధ్య ఊగిస‌లాడుతున్నారు. కొంద‌రేమో ప్రీలాంచుల వైపు మొగ్గు చూపుతుండ‌గా.. మ‌రికొంద‌రేమో వేచి చూసే ధోర‌ణీలోకి వెళ్లిపోయారు.

యూడీఎస్‌, ప్రీలాంచ్ అమ్మ‌కాల ద్వారా వ‌చ్చే సొమ్ముతో ప్ర‌మోట‌ర్లు ఎక్కువ‌గా స్థ‌లాన్ని కొనేందుకు వెచ్చిస్తున్నారు. ఇందుకోసం వీరేం చేస్తున్నారంటే.. మార్కెట్లో సాధార‌ణంగా బిల్డ‌ర్లు విక్ర‌యించే రేటు కంటే యాభై శాతం త‌క్కువ‌కే అమ్ముతున్నారు. ఇలాంటి వారంతా సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తూ.. రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా అమ్మ‌కాలు జ‌రుపుతున్నారు. ఇందుకోసం ఆయా ఏజెంట్ల‌కు అధిక శాతం క‌మిష‌న్‌ను అంద‌జేస్తున్నారు. ఈ సొమ్ముకు ఆశ‌ప‌డిన రియ‌ల్ట‌ర్లు పోటీప‌డి మ‌రీ యూడీఎస్, ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నారు. రెరా నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఈ ఏజెంట్లు కూడా రెరా ప‌రిధిలో న‌మోదు చేసుకోవాలి. ఇందుకోసం రూ.10,000 ఫీజు చెల్లించాలి. ఏదైనా రియ‌ల్ సంస్థ‌లో ప‌ని చేసే ఏజెంట్లు రెరాలో న‌మోదు చేసుకోవాల్సిందే. కానీ, అధిక శాతం రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు ఈ నిబంధ‌న‌ను పాటించ‌ట్లేదు. ఏజెంట్ల‌ను ఏం చేస్తారులే అని అనుకోవ‌ద్దు. ఎక్క‌డైనా పొర‌పాటు జ‌రిగితే బిల్డ‌ర్‌తో పాటు ఏజెంట్లు కూడా జైలులో ఊచ‌లు లెక్క పెట్టాల్సి ఉంటుంది.

యూడీఎస్, ప్రీలాంచుల్లో అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని భూమి కొనేందుకు వెచ్చించ‌గా.. మిగిలిన సొమ్ముతో నిర్మాణం చేపట్టడం కష్టమే. ఫ‌లితంగా, నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉండదు. పైగా, అధిక శాతం రియ‌ల్ట‌ర్లు లేదా బిల్డ‌ర్లు, అట్టి సొమ్మును ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టకుండా ఇతర అవసరాల నిమిత్తం మళ్లిస్తున్నారు. ఇలాంటి కేసులు హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. దీంతో, కొనుగోలుదారులకు ఎక్క‌డ్లేని నష్టం వాటిల్లుతోంది.
నిర్మాణ రంగంలో పెద్దగా అనుభవం లేనివారు యూడీఎస్లో ఫ్లాట్లను విక్రయిస్తూ.. 25 నుంచి 40 అంతస్తుల్లో అపార్టుమెంట్లను కట్టేందుకు ముందుకొస్తున్నారు. అంత భారీ స్థాయిలో బహుళ అంతస్తుల అపార్టుమెంట్లను కట్టడం వీరికి శక్తికి మించిన పని అని చెప్పుకోవచ్చు. పైగా, వీరికి సాంకేతిక సామర్థ్యం కూడా ఉండకపోవడంతో నిర్మాణాల్ని పూర్తి చేయడం కష్టమవుతుందని చెప్పొచ్చు. వీరు చేస్తున్న అనైతిక వ్యాపారం వల్ల సక్రమంగా అపార్టుమెంట్లు కట్టేవారికి నష్టం వాటిల్లుతుంది. అంతెందుకు, ప్రభుత్వానికీ నష్టం జరుగుతోంది. ఫ్లాట్ల బదులు యూడీఎస్ కింద స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ప్రభుత్వ‌మూ ఆదాయాన్ని కోల్పోతుంది.

అడ్డుకట్ట ఇలా వేయాలి..

జీహెచ్ఎంసీ వంటి ఇత‌ర కార్పొరేష‌న్లు, హెచ్ఎండీఏ లాంటి ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌లు, మున్సిపాలిటీలు, డీటీసీపీల ప‌రిధిలో.. బిల్డ‌ర్లు కొత్త‌గా ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వ్య‌క్తిగ‌త గృహాలు వంటి వాటిని అభివృద్ధి చేసేందుకు ముందుగా అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటారు. అనుమ‌తిని మంజూరు చేసేట‌ప్పుడే.. రెరాలో న‌మోదు చేసుకున్నాకే ప్ర‌క‌ట‌న‌ల్ని విడుద‌ల చేయాల‌నే నిబంధ‌న‌ను పొందుప‌ర్చాలి. అంటే, ఇలాంటి ఓ కండీష‌న్ పెట్టాల‌న్న‌మాట‌. ఇలా చేయ‌డం వ‌ల్ల‌, ప్ర‌తిఒక్క‌రూ విధిగా రెరాలో త‌మ ప్రాజెక్టును న‌మోదు చేసుకుంటారు.
ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ మంజూరు చేసేట‌ప్పుడు.. ఆయా ప్రాజెక్టుకు రెరా అనుమ‌తి ఉందా? లేదా? అనే విష‌యాన్ని త‌ప్ప‌కుండా ప‌రిశీలిస్తామ‌నే నిబంధ‌న‌ను అనుమ‌తి ప‌త్రం విడుద‌ల చేసే స‌మ‌యంలోనే పొందుప‌ర్చాలి. దీంతో, ఓసీ రావాలంటే రెరా స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిసరిగా ఉండాల‌నే విష‌యం బిల్డ‌ర్ల‌కు అర్థ‌మ‌వుతుంది.
రెరాలో నమోదు చేసుకోకుండా అభివృద్ధి చేసే అపార్టుమెంట్ల నుంచి.. ప్రాజెక్టు విలువ‌లో ప‌ది శాతం జ‌రిమానా తప్ప‌కుండా వ‌సూలు చేయాలి. లేదా మూడేళ్ల పాటు జైలు శిక్ష‌ను విధించాలి. కొంద‌రికి ఈ రెండింటిని విధించాలి. గ‌త రెండేళ్ల నుంచి అక్ర‌మ తంతు జ‌రుగుతున్నా, రెరా అథారిటీ నిమ్మ‌కు నీరెత్త‌కుండా వ్య‌వ‌హ‌రిస్తోందనే విమర్శ‌లు వినిపిస్తున్నాయి.
యూడీఎస్‌లో ఫ్లాట్లు కొనేవారు ఆయా ప్రాజెక్టులో స‌హ య‌జ‌మానులు అవుతారే త‌ప్ప ఫ్లాట్ య‌జ‌మానులు కారు. కాబ‌ట్టి, రేపొద్దున డెవ‌ల‌ప‌ర్ ఆయా ప్రాజెక్టును పూర్తి చేయ‌క‌పోతే, ఆ పాప‌భారం వీరి మీద కూడా ప‌డుతుంది. ప్రభుత్వం విధించే జ‌రిమానాను క‌ట్ట‌డంతో పాటు జైలుకూ వెళ్లే ప‌రిస్థితి రావొచ్చు.
హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌తో పాటు ఇత‌ర న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో యూడీఎస్‌, ప్రీలాంచ్ ప్రాజెక్టులు అధిక‌మ‌వుతున్నాయి. అందులో కొన్న‌వారు మోస‌పోతున్నారు. కాబ‌ట్టి, మోస‌పోయిన కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదుల్ని స్వీక‌రించేందుకు రెరా అథారిటీ ప్ర‌త్యేకంగా కాల్ సెంట‌ర్ ఏర్పాటు చేయాలి. అప్పుడే ఏయే ప్రాంతాల్లో ఈ మోసాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌నే విష‌యం ప్ర‌భుత్వం దృష్టికి వ‌స్తుంది. స‌కాలంలో ఆయా మోసాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు.
యూడీఎస్ కింద ప్లాట్ల‌ను రిజిస్ట‌ర్ చేయ‌కూడ‌ద‌ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ 2021 మార్చి 31న స‌ర్కుల‌ర్ జారీ చేసింది. అంత‌కంటే ముందు నుంచి ఇలాంటి ఆదేశాలే అమ‌ల్లో ఉన్నాయి. కాక‌పోతే, కొంద‌రు స‌బ్ రిజిస్ట్రార్లు ఈ నిబంధ‌నను ప‌ట్టించుకోకుండా.. యూడీఎస్ ప్ర‌మోట‌ర్ల‌తో లాలూచి ప‌డి.. వారి ఆఫీసుల‌కే వెళ్లి, అక్క‌డే కూర్చోని రిజిస్ట్రేష‌న్లు చేస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు సంగారెడ్డి, స‌దాశివ‌పేట్‌, జ‌న‌గాం, బ‌చ్చ‌న్న‌పేట్‌, ఆలేరు, మ‌హ‌బూబ్‌న‌గర్‌, జ‌డ్చ‌ర్ల‌, వికారాబాద్, ఇబ్ర‌హీంప‌ట్నం వంటి ప్రాంతాల్లోని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో నేటికీ యూడీఎస్ కింద ప్లాట్ల‌ను రిజిస్ట్రేష‌న్ చేస్తున్నార‌ని స‌మాచారం. కాబ‌ట్టి, రిజిస్ట్రేష‌న్ శాఖ స్పందించి త‌మ సిబ్బందిని మ‌రొక‌సారి హెచ్చ‌రించాల్సిన ఆవ‌శ‌క్య‌త ఉంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles