-
- కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన
రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్-బయ్యర్ మోడల్ అగ్రిమెంట్ ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. మధ్యతరగతికి చెందిన గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మోడల్ బిల్డర్-బయ్యర్ అగ్రిమెంట్ నిమిత్తం రెరా కింద మార్గదర్శకాలూ రూపొందించాలని సూచించింది. ఈ అంశాన్ని రాష్ట్రాలకు వదిలివేయడం కంటే కేంద్రమే ఒక విధానం రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ అగ్రిమెంట్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు, రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం మోడల్ అగ్రిమెంటు రూపొందించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ అనే లాయర్ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఉన్న మోడల్ అగ్రిమెంట్లను బిల్డర్లు ప్రభావితం చేసే పరిస్థితి ఉందని.. పైగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరుగా నిబంధనలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకేవిధమైన మోడల్ అగ్రిమెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై గతంలో ఓసారి విచారణ జరిపిన న్యాయస్థానం.. తన వైఖరి తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తాజాగా మరోసారి ఈ పిటిషన్ విచారణకు రావడంతో ధర్మాసనం కీలక సూచనలు చేసింది. మోడల్ బిల్డర్-బయ్యర్ అగ్రిమెంట్ రూపకల్పన అనేది చాలా ముఖ్యమైన అంశమని.. సెంట్రల్ అడ్వైజరీ కౌన్సిల్ సరైన మార్గదర్శకాలు రూపొందించాలని పేర్కొంది. ‘ఈ విషయంలో మేం చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాం. దీనిని రాష్ట్రాలకు వదిలివేయకుండా దేశం మొత్తం ఒకటే విధానం అమలయ్యేటట్టు కేంద్రమే విధివిధానాలు రూపొందించాలని భావిస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.