కొనుగోలుదారులను మోసం చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం నలుగురు బిల్డర్లు పెటుకున్న దరఖాస్తులను హైకోర్టు కొట్టివేసింది. ఓ ప్రాజెక్టులో తమను మోసం చేశారంటూ కొనుగోలుదారులు వ్యాజ్యం దాఖలు చేయగా.. నలుగురు బిల్డర్లు తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వారి పిటిషన్లను తోసిపుచ్చింది. ‘ఆ మొత్తం భవనమే అక్రమమని ప్రాసిక్యూషన్ చెబుతోంది. 18 ఫ్లాట్లకు అనుమతి మంజూరు కాగా,, వాటిపై ఏకంగా 70 లావాదేవీలు జరిపారు. అందువల్ల అవన్నీ మోసపూరితమే’ అని న్యాయస్థానం స్పష్టంచేసింది. దరఖాస్తుదారుల పాత్ర ఏమిటనేది ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా పేర్కొనడంతోపాటు ఇప్పటివరకు జరిగిన విచారణలో కూడా తేలిందని వ్యాఖ్యానించింది. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఒప్పందాలు చేయలేదని, అలాగే ఫ్లాట్ల అప్పగింత కూడా జరగలేదని, అందువల్ల ఈ అంశంలో కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. పైగా ఈ వ్యవహారంలో చాలామంది బాధితులు డబ్బులు నష్టపోయినందున నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని పేర్కొంటూ వారు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.
ముంబైకి చెందిన డాక్టర్ దేవీదాస్ రౌత్.. 2012లో నైన్ గ్లోబ్ బిల్డర్స్ చేపట్టిన హాజల్ హోమ్స్ ప్రాజెక్టులో రూ.73 లక్షలకు ఓ ఫ్లాట్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు విక్రయ వ్యవహారలు చూస్తున్న అర్బన్ ఒన్ రియాల్టీ డైరెక్టర్లు ఎస్ జీ కల్లన్, ఏఆర్ తినానీలను కలిశారు. కావాల్సిన ఫ్లాట్ ఎంపిక చేసుకున్న తర్వాత 2013 జనవరిలో రూ.32 లక్షలు నగదు ఇచ్చారు. అనంతరం దశలవారీగా చెక్ ద్వారా చెల్లింపులు చేశారు. అయితే, అర్బన్ ఒన్ కంపెనీ ఆయనతో ఎలాంటి ఒప్పందం చేయలేదు. పైగా ప్రాజెక్టు బిల్డర్ నైన్ గ్లోబ్ బిల్డర్స్ ఆ ఫ్లాట్ ను 2014 డిసెంబర్ లో ధర్మేంద్ర మెహతాకు విక్రయించినట్టు రౌత్ తెలుసుకున్నారు. దీంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం పలువురు కొనుగోలుదారులు కూడా ఈ బిల్డర్లపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలకు చెందిన కల్లన్, తినానీలతోపాటు అబ్దుల్ జోయెబ్, రాఛెల్ డిసౌజాలు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని విచారించిన న్యాయస్థానం.. కొనుగోలుదారుల తరఫు వాదనలు కూడా విన్న తర్వాత వారి పిటిషన్లు కొట్టివేసింది.