ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే హైదరాబాద్ రియాల్టీకి ఏదో నష్టం వాటిల్లుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక్కడి మార్కెట్ కుప్పకూలుతుందని.. అమ్మకాలు తగ్గిపోతాయని కొందరు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రతిఒక్కరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. తెలంగాణలో శాసన సభ ఎన్నికలు జరగక ముందు నుంచీ ఇక్కడి మార్కెట్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఫలితాలు వెలువడ్డాక మార్కెట్ కొంత నీరసించింది. ఆశించినంత స్థాయిలో ఫ్లాట్లను కొనేవారు తగ్గిపోయారు. అయితే, గత రెండు నెలలు సెలవులు కావడంతో అధిక శాతం మంది టూర్లకు వెళ్లడమో.. స్వస్థలాలకు పయనమయ్యారు. జూన్‌లో స్కూళ్లు ఆరంభమవుతాయ్.. వర్షాలు ఊపందుకుంటాయ్.. ఆతర్వాత ఆషాడమాసం వంటి వాటి వల్ల మార్కెట్లో అమ్మకాలు తగ్గుతాయి. ఇది ప్రతిఏటా జరిగే పరిణామామే. ఇలాంటి సహజసిద్ధమైన అంశాల్ని గమనించకుండా.. మార్కెట్లో ఫ్లాట్ల అమ్మకాలు రానున్న రోజుల్లో తగ్గుముఖం పడతాయని విశ్లేషించడం కరెక్టు కాదు.
2014లో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు.. అధిక శాతం మంది హైదరాబాద్ పని అయిపోయిందన్నారు. అమరావతి అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని ఊదరగొట్టారు. కానీ, ఆ తర్వాత జరిగిందేమిటో అందరికీ తెలిసిందే. అయితే, వాస్తవికంగా ఆలోచిస్తే.. హైదరాబాద్ వంటి నగరం అభివృద్ధి చెందడానికి సుమారు ముప్పయ్ ఏళ్లు పట్టింది. అంతేతప్ప, రాత్రికి రాత్రో.. ఐదేళ్లకో డెవలప్ అవ్వలేదు. కాబట్టి, అమరావతి అభివృద్ది ఆరంభమైనప్పటికీ.. అది పూర్తి స్థాయి రాజధానిగా విరజిల్లాలంటే.. ఒకట్రెండు దశాబ్దాలైనా పడుతుంది.
హైదరాబాద్ ఇప్పటికే అభివృద్ది చెందిన నగరం. మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్న భాగ్యనగరంలో ఎలాంటి అంతర్జాతీయ సంస్థ అయినా సులువుగా తమ కార్యకలాపాల్ని ఆరంభించొచ్చు. కానీ, అమరావతిలో ఆ పరిస్థితులు ఏర్పడటానికి మరింత సమయం పడుతుందని చెప్పొచ్చు. కాబట్టి, వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేస్తే.. అమరావతి ఏర్పాటైనా.. హైదరాబాద్ రియాల్టీకి వచ్చే నష్టమేం లేదు. రెండు రాష్ట్రాల మధ్య పోటీతత్వంతో.. మరింత వృద్ది చెందే అవకాశాలున్నాయని చెప్పొచ్చు.
ఇక్కడి అనుకూల వాతావరణం, శాంతిభద్రతలు, స్నేహంతో మెలిగే ప్రజలు, భారీ స్థాయిలో షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్సులు, అందుబాటులోకి వచ్చిన మెట్రో, ఇప్పటికే డెవలప్ అయి ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, భవిష్యత్తులో డెవలప్ అయ్యే రీజినల్ రింగ్ రోడ్డు వంటి వాటితో.. హైదరాబాద్ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పథంలోకి దూసుకెళుతుంది. కాబట్టి, ఎలా చూసినా అమరావతి ఏర్పాటైనా భాగ్యనగరానికి ఇప్పట్లో వచ్చే నష్టమేం లేదని చెప్పొచ్చు.
This website uses cookies.