ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతుండటంతో అమరావతికి ఊపిరి వచ్చింది. వారం రోజుల క్రితం వరకు స్తబ్దుగా ఉన్న అమరావతి రియల్ మార్కెట్.. ఎగ్జిట్ పోల్స్ తో లేచి కూర్చుంది. ఫలితాలు వెలువడగానే జోరుగా దూసుకెళ్తోంది. చంద్రబాబు విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో భూముల ధరలు రెట్టింపయ్యాయి. ప్రాజెక్టుల ధరలు 10 నుంచి 20 శాతం మేర పెరిగాయి. వచ్చే ఏడాదిలో భూముల ధరలు మరో 50 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో భూమలు ధరలు చదరపు గజం దాదాపు రూ.40 వేలు పలికింది. అయితే, 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను ప్రకటించడంతో అమరావతి భూముల ధరలు రూ.13 వేల నుంచి రూ.14వేలకు పడిపోయాయి. తాజాగా చంద్రబాబు అధికారంలోకి రావడంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి, అమరావతే రాజధాని అని ప్రకటించగానే ధరలు మళ్లీ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే అమరావతిలోని ఓ ప్రాజెక్టులో చదరపు అడుగు ధర రూ.5,500 నుంచి రూ.5,800కి పెంచారు. ఈ ఏడాది వీటి ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
అమరావతి రాజధాని నిర్మాణమైతే వచ్చే ఐదేళ్లలో పూర్తి చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నించే అవకాశముంది. అయితే, రాజధాని వస్తుందనే ఏకైక కారణంతో.. వచ్చే పది నుంచి ఇరవై ఏళ్లలో పెరగాల్సిన రేట్లను ఇప్పుడే పెంచే ప్రబుద్ధులుంటారు. కాబట్టి, అభివృద్ధి ఎక్కడ జరుగుతుందనే అంశాన్ని పక్కగా గుర్తించాకే ప్లాట్లు, ఫ్లాట్లలో పెట్టుబడి పెట్టాలి. అంతేతప్ప రియల్ ఎస్టేట్ ఏజెంట్లను మాటల్ని గుడ్డిగా నమ్మేసి పెట్టుబడులు పెట్టకండి.
This website uses cookies.