మనదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగానే పెరుగుతోంది. ముఖ్యంగా ఇళ్ల కొనుగోళ్లు బాగానే సాగుతున్నాయి. అయినప్పటికీ వృద్ధి రేటులో కొంత క్షీణత నమోదైంది. ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు, ఉద్యోగాల కోత వంటివి భారతీయ కంపెనీల కార్యకలాపాలపై ప్రభావం చూపించడమే ఇందుకు కారణం. ఫలితంగా ఇళ్ల కొనుగోళ్లపై కాస్త ప్రభావం పడొచ్చనేది అంచనా. వాస్తవానికి ఇళ్ల ధరలు 5 నుంచి 6 శాతం పెరిగినప్పటికీ, 2022 ద్వితీయార్థంలో ప్రపంచ ఆర్థిక మాంద్యం ముప్పు స్పష్టంగా కనిపించినప్పటికీ ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతూనే ఉన్నాయి.
జనవరి – మార్చి కాలంలో 15 నుంచి 17 శాతం మేర కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. ఇళ్ల డిమాండ్ కొనసాగుతోంది. అయితే, వృద్ధి రేటు మాత్రం క్రమంగా తగ్గుతున్న దాఖలాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తనఖా రేట్లు పెరుగుదల ఓ కారణంగా చెప్పొచ్చు. ఏప్రిల్-జూన్, జూలై-సెప్టెంబర్ త్రైమాసికాల్లోనూ ఇళ్ల కొనుగోళ్లలో పురోగమనం ఉంటుందని అంచనా. అయితే, ప్రపంచ అస్థిరతల కారణంగా దీనిపై కాస్త ఒత్తిడి పడే అవకాశం ఉంది. మరోవైపు ఆఫీస్ స్పేస్ టేకప్ మాత్రం తిరోగమనంలో ఉంది. గత రెండు త్రైమాసికాల్లో ఈ ఒరవడి స్పష్టంగా తెలిసింది. గ్లోబల్ ఎంఎన్ సీలు కమిట్ మెంట్లను నిలిపివేయడం లేదా స్పేస్ టేకప్ చర్చలను తాత్కాలికంగా వాయిదా వేడంతో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ టేకప్ ఊహించిన దాని కంటే చాలా తక్కువగా నమోదైంది. ప్రస్తుతం మనదేశంలో మాంద్యం ప్రభావం లేకపోయినా.. అమెరికా సహా పలు దేశాల్లో ఈ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే అది భారత్ పైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రజలు నగదు ఆదా చేయాలనుకోవడంతో ఇంటి కొనుగోలును వాయిదా వేస్తారు. మరోవైపు ఇంటి ధరలు ఏటా 5 నుంచి 7 శాతం మేర పెరుగుతున్నాయి. లొకేషన్, ప్రాజెక్టు స్థితిని బట్ ప్రతి త్రైమాసికంలో ఒక శాతం నుంచి 3 శాతం కూడా పెరుగుతున్నాయి. సరసమైన ఇళ్ల విభాగంలో ధరల్లో పెద్దగా మార్పు ఉండదు కానీ.. మధ్య, ప్రీమియం సెగ్మెంట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.