Categories: TOP STORIES

ఆ బడా సంస్థకే అమ్మకాల్లేవ్! ఎందుకు?

  • కరోనా కారణం కాదు..
  • అభివృద్ధి కాంక్షించే ప్రభుత్వం
  • మెరుగైన విధానపరమైన నిర్ణయాలు
  • మౌలిక అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
  • దేశ, విదేశీ పెట్టుబడులకు ఢోకా లేదు
  • అయినా అమ్మకాల్లేవు ఎందుకు?

గత ఏడాది నుంచి నగరానికి చెందిన ఒక బడా నిర్మాణ సంస్థ అమ్మకాల్లేక నానా ఇబ్బందులు పడుతోంది. ప్రాజెక్టులు ఎక్కువే ఉన్నాయి.. ప్రచారం మెరుగ్గానే చేస్తోంది.. కానీ, ఆశించినంత స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. పోనీ, రాష్ట్రంలో ప్రభుత్వపరంగా లోటుపాట్లు ఉన్నాయా? అంటే అదీ లేదు. దేశ, విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. గత ప్రభుత్వాలతో పోల్చితే మౌలిక సదుపాయాల్ని ప్రభుత్వం డెవలప్ చేస్తోంది. అయినా, కొనుగోలుదారులు ఎందుకు పెద్దగా ఫ్లాట్లను కొనడం లేదు?

దేశంలోని ఇతర నగరాలకు చెందిన పెట్టుబడిదారులు భూముల్ని కొనేందుకు హైదరాబాద్ విచ్చేయడంతో.. మన మార్కెట్ దూసుకుపోతుందని చాలామంది బిల్డర్లు భావిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో ఎక్కడ పెట్టుబడి పెట్టినా తగిన రాబడి రాదని భావించే వాళ్లంతా ఇక్కడికొస్తున్నారు. ఈ విషయం మర్చిపోయి.. అంతా బాగుందని భావిస్తూ.. ఫ్లాట్ల ధరల్ని అమాంతంగా పెంచేశారు. అంతకంటే ముందు, చదరపు అడుక్కీ రూ.5 నుంచి 6 వేలు ఉండే గచ్చిబౌలి ప్రాంతంలో ఎనిమిది నుంచి పది వేలు చెబుతున్నారు. చదరపు అడుక్కీ రూ.3,500 ఉన్న ఏరియాలో ఐదున్నర వేలు చేసేశారు

మియాపూర్లో చ.అ.కీ. 4000 పెడితే డీసెంట్ ఫ్లాట్ లభించేది. అక్కడా రూ.6000కు పెంచేశారు. ఇలా, దాదాపు అన్ని చోట్ల రేట్లు పెంచడంతో.. అప్పటివరకూ ఫ్లాట్లు కొనాలనే ఆలోచనలతో ఉన్నవారూ వెనకడుగు వేస్తున్నారు. ఇక, ఒక సంస్థ అయితే, ఏకంగా చదరపు అడుక్కీ రూ.14000కు విక్రయిస్తోంది. అప్పటివరకూ, ఈ నిర్మాణానికి చేరువలో మరో సంస్థ చదరపు అడుక్కీ రూ.4500 నుంచి రూ.5000కు విక్రయించేది. మరి, వీళ్లంతా పెరిగిన భూముల ధర చొప్పున స్థలం కొనుగోలు చేసి.. అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారా? అంటే.. అదీ లేదు.

హైదరాబాద్లో అధిక శాతం డెవలపర్లు చేసేవి డెవలప్మెంట్ ప్రాజెక్టులే. రెండు, మూడేళ్ల క్రితం ఆరంభించినవే. ఇదే విషయాన్ని కొందరు బిల్డర్లను ప్రశ్నిస్తే.. భూముల ధరలు పెరిగాయి కదా అని జవాబిస్తున్నారు. ఎప్పుడో ఆరంభించిన ప్రాజెక్టులకు పెరిగిన భూముల ధరలెలా వర్తిస్తాయనే విషయాన్ని వీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

వాస్తవికంగా ఆలోచించాలి

ఇప్పటికైనా నగర బిల్డర్లు మార్కెట్ స్థితిగతుల్ని గమనించి.. వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని.. ఫ్లాట్ల ధరల విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. కొత్త ప్రాజెక్టులైతే అధిక ధర వెచ్చించి ఉంటారు కాబట్టి, రేటు విషయంలో పునరాలోచించాల్సిన అవసరం లేదు. చేస్తున్నవి పాత ప్రాజెక్టులే అయినప్పటికీ.. సిమెంటు, స్టీలు, లేబర్ ఖర్చులు పెరిగాయని ఫ్లాట్ల రేట్లను ఇబ్బడిముబ్బడిగా పెంచడం ఎంతవరకూ కరెక్టు?

This website uses cookies.