Categories: LATEST UPDATES

హైదరాబాద్లో 20 శాతం తగ్గిన అద్దెలు

హైదరాబాద్లో ఇంటి అద్దెలు తగ్గుముఖం పట్టాయి. కరోనా మొదటి ఫేజులో అధిక శాతం మంది ఇంటి నుంచే పని చేయడం ఆరంభమైంది. దీంతో, అధిక శాతం ఐటీ ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. గత అక్టోబరులో కొందరు ఉద్యోగులు తిరిగి హైదరాబాద్ వచ్చినప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ వల్ల గత నెలలో మళ్లీ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. కొందరైతే, ఇక తప్పదన్నట్లు ఇక్కడే అద్దె ఇళ్ల నుంచి పని చేస్తున్నారు. జూన్లో కేసులు తగ్గుముఖం పడితే మళ్లీ ఆఫీసు ఆరంభమవుతుందని వీరి ఆలోచన. అయితే, ఇలా ఆలోచించేవారి సంఖ్య తక్కువగా ఉంది.

నేటికీ, హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీగానే ఉన్నాయి. ఇక, తప్పదన్నట్లు ఇంటి యజమానులూ అద్దెలను దాదాపు ఇరవై శాతం మేరకు తగ్గిస్తున్నారు. నిన్నటివరకూ గేటెడ్ కమ్యూనిటీల్లో రెండు పడక గదుల ఫ్లాట్ నెల అద్దె రూ.25,000 దాకా ఉండేది. ప్రస్తుతం అది రూ.20 వేలు చెప్పినా.. గత కొంతకాలం నుంచి ఖాళీగానే ఉంటున్నాయి. ఇక ఐటీ కారిడార్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కొన్ని ఏరియాల్లో గత తొమ్మిది నెలల్నుంచి అధిక శాతం ఇళ్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.

This website uses cookies.