దేశంలో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. కరోనా తర్వాత మారిన ప్రాధాన్యతల్లో భాగంగా ఎక్కువమంది కొనుగోలుదారులు విశాలమైన, విలాసవంతమైన ఇళ్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ.4 కోట్లు అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే ఇళ్ల విక్రయాలు 2023లో 75 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా సంపన్నులు లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది.
హైదరాబాద్‌లో గతేడాది విలాస గృహాల అమ్మకాలు 2,030 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది (2022)లో ఇవి 1,240 యూనిట్లు కావడం గమనార్హం. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో రూ.4 కోట్లు, అంతకుమించి విలువైన ఇళ్ల అమ్మకాలు 2023లో 12,935 యూనిట్లు కాగా, 2022లో 7,395 ఇళ్లు అమ్ముడయ్యాయి. పట్టణాల వారీగా చూస్తే.. ఢిల్లీ-ఎన్సీఆర్ లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు 2023లో 5,530 యూనిట్లు కాగా, 2022లో 1,860 యూనిట్లు అమ్ముడయ్యాయి. ముంబైలో 2023లో 4,190 యూనిట్లు విక్రయం కాగా, 2022లో 3,390 యూనిట్లు అమ్ముడయ్యాయి. పుణెలో 450 యూనిట్లు అమ్ముడుకాగా, 2022లో 190 యూనిట్లు విక్రయమయ్యాయి. బెంగళూరులో 2023, 2022లోనూ 265 యూనిట్లే అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో 2022లో 300 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడుపోగా, గతేడాది ఇవి 310 యూనిట్లకు పెరిగాయి.
చెన్నైలో 150 యూనిట్ల నుంచి 160 యూనిట్లకు అమ్మకాలు పెరిగాయి. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 2023లో అన్ని రకాల ధరల కేటగిరీల్లో ఇళ్ల అమ్మకాలు 3,22,000 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9 శాతం అధికం.
మెరుగైన డిమాండ్ నేపథ్యంలో డెవలపర్లు 3,13,000 యూనిట్ల కొత్త ఇళ్ల యూనిట్లను ప్రారంభించారు. 2022తో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ. ‘ఖరీదైన, విలాసవంతమైన ఇళ్లకు ఆదరణ కొనసాగుతుంది. మార్కెట్ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడంతో సమీప భవిష్యత్తులో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదవుతుంది. ప్రాంతీయంగా కొంత అస్థిరతలు ఉన్నప్పటికీ, మొత్తమ్మీద భవిష్యత్ మార్కెట్ అనుకూలంగానే ఉంటుంది’ అని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు.