Categories: TOP STORIES

అయ్య‌ప్ప సొసైటీలో అన్నీ అక్ర‌మ నిర్మాణాలే

  • హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌

హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలపై కొరడా ఝ‌ళిపించిన‌హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. మాధాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని నేలమ‌ట్టం చేసింది. అయ్యప్పసొసైటీలో దాదాపు అన్ని నిర్మాణాలు చట్ట విరుద్దమేనని చెప్పిన హైడ్రా కమీషనర్ రంగనాధ్.. వాటన్నింటిపైనా త్వరలోనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో అయ్యప్ప సొసైటీలో వందలాది నిర్మాణాల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థ‌కంగా మారింది.

హైదరాబాద్లోని మాదాపూర్‌లో గ‌ల‌ అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన విషయాల‌న్ఇ వెల్లడించారు. అయ్యప్ప సొసైటీలో ఓ అక్రమ భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించగా.. గతంలో స్లాబ్ పై కొన్ని రంధాలు వేయగా.. బిల్డర్ ఆ రంధ్రాలను మూసివేసి 7 అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని క‌ట్టాడ‌ని రంగనాథ్‌ సీరియస్ అయ్యారు. హైకోర్టులో ధిక్కార పిటిషన్ కూడా దాఖలైందని, విచారణలో ఉందని తెలిపారు. అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్ని నిర్మాణాలు చట్ట విరుద్ధమని, ప్రస్తుతం కూల్చివేసిన భవనాన్ని అక్రమంగా నిర్మించేందుకు అనుమతించినందుకు బాధ్యులైన అధికారులపై నివేదిక ఇస్తామ‌న్నారు. వారిపై చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. ఈ అక్రమ భవనాల్లో అనేక హాస్టళ్లు వస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

అయ్యప్ప సొసైటీలోని అనేక భవనాలను అగ్నిమాపక భద్రత, భవన నిర్మాణ అనుమతి లేకుండానే నిర్మించగా.. వాటిలో వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉంటున్నారని రంగనాథ్ చెప్పారు. తాను అయ్యప్ప సొసైటీ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు.. పలు చోట్ల డ్రైనేజీ రోడ్డుపై ప్రవహించడం గమనించినట్లు తెలిపారు. ఇక్క‌డి నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ తో సమీక్షించి, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి సోమవారం హైదరాబాద్ నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. బుద్ధ భవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 దాకా, తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామ‌ని రంగనాథ్‌ తెలిపారు.

This website uses cookies.