Categories: TOP STORIES

వడ్డీపై మినహాయింపు రూ.5 లక్షలకు పెంచాలి

కేంద్రానికి నరెడ్కో వినతి

కేంద్ర ప్రభుత్వం ఈనెల 23న లోక్ సభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో రియల్ రంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాలని బిల్డర్లు కోరుతున్నారు. ముఖ్యంగా అందుబాటు ధరల ఇళ్ల కొనుగోళ్లు, నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలని విన్నవిస్తున్నారు. ఇంటికోసం తీసుకున్న రుణంపై కట్టే వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని రియల్టర్ల సమాఖ్య నరెడ్కో విజ్ఞప్తి చేసింది. ప్రాపర్టీ ధరలు, వడ్డీ రేట్లు పెరిగిపోయిన నేపథ్యంలో దీనిని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ప్రస్తుతం ఈ మినహాయింపు పరిమితి రూ.2 లక్షలుగా ఉంది. అలాగే స్టాక్ ఇన్ ట్రేడ్‌గా వ్యవహరించే ప్రాపర్టీపై నామమాత్ర ఆదాయాన్ని లెక్కగట్టే వ్యవధిని ప్రస్తుతమున్న రెండేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచాలని నరెడ్కో కోరింది. మార్కెట్‌లో పరిస్థితులు బాగాలేనప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్లు నిల్వలను అలాగే ఉంచుకుంటారని.. అందువల్ల వారికి ఈ విషయంలో వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఈ సిఫార్సులను అమలు చేస్తే డెవలపర్లకు ఊరట లభించడంతో పాటు హౌసింగ్ రంగంలో డిమాండ్‌కి కూడా ఊతం పెరుగుతుందని నరెడ్కో అధ్యక్షుడు జి. హరిబాబు తెలిపారు.

This website uses cookies.