సీబీఆర్ఈ నివేదికలో వెల్లడి
దేశంలో లగ్జరీ హౌసింగ్ విభాగం జోరుగా దూసుకెళ్తోంది. రూ.4 కోట్లు అంతకుమించి ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు భారీగా జరిగాయి. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 27 శాతం పెరుగుదల నమోదైంది. గతేడాది తొలి అర్ధభాగంలో ఈ సెగ్మెంట్ లో 6,700 యూనిట్లు అమ్ముడు కాగా.. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో అవి 8,500కి పెరిగాయి. లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ టాప్ లో ఉన్నాయి. మొత్తం ఇళ్ల అమ్మకాల్లో ఈ మూడు నగరాల వాటా 84 శాతంగా ఉంది. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తన తాజా నివేదికలో వెల్లడించింది.
పుణె సైతం విలాసవంతమైన ఇళ్ల అమ్మకాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపింది. ఇక్కడ గతేడాది జనవరి-జూన్ కాలంలో 200 లగ్జరీ విక్రయాలు నమోదు కాగా, ఈ ఏడాది ప్రథమార్ధంలో 1100 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక నగరాలవారీగా చూస్తే.. ఢిల్లీ గతేడాది ఇదే సమయంలో 2900 ఇళ్ల విక్రయాలను నమోదు చేయగా.. ఈ సారి 13.8 శాతం పెరుగుదలతో 3300కి పెరిగాయి. ముంబై గతేడాది తొలి అర్ధభాగంలో 2200 ఇళ్ల అమ్మకాలు జరపగా.. ఈ సారి 2,500కి పెరిగింది. అంటే 13.6 శాతం వృద్ధి నమోదైంది. హైదరాబాద్ లో గతేడాది తొలి ఆరునెలల్లో 900 లగ్జరీ ఇళ్లు అమ్ముడవగా.. ఈ ఏడాది అదే సమయంలో 44 శాతం పెరుగుదలతో 1300 ఇళ్లు అమ్ముడయ్యాయి. త్రైమాసికాలవారీగా చూసినా లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో పెరుగుదల కనిపించింది.
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలోని ప్రధాన నగరాల్లో 40.1 శాతం పెరుగుదలతో 4410 లగ్జరీ యూనిట్లు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ సంఖ్య 3150గా ఉంది. ఈ త్రైమాసికంలో కూడా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ కీలకంగా ఉండగా.. కోల్ కతాతో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు రెండు రెట్లు పెరిగాయి. మొత్తమ్మీద రెసిడెన్షియల్ సెగ్మెంట్ ఈ ఏడాది ప్రథమార్ధంలో తన ఊపు కొనసాగించింది. ఈ కాలంలో మొత్తం 1.56 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అలాగే అన్ని కేటగిరీల్లో కొత్తగా 1.53 లక్షల యూనిట్లు లాంచ్ అయ్యాయి. జనవరి-జూన్ కాలంలో జరిగిన మొత్తం ఇళ్ల అమ్మకాల్లో ముంబై, పుణె, బెంగళూరు కలిసి 63 శాతం వాటా కలిగి ఉన్నాయి.
లాంచ్ ల పరంగా ముంబై, పుణె, హైదరాబాద్ లో 64 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికాన్ని తీసుకుంటే 70,100 యూనిట్లు అమ్ముడవగా.. 69,600 కొత్త యూనిట్లు లాంచ్ అయ్యాయి. ముంబై, పుణె, ఢిల్లీ సంయుక్తంగా అపార్ట్ మెంట్ లాంచ్ లలో 62 శాతం వాటాతో ఆధిపత్యం ప్రదర్శించాయి. అమ్మకాల్లో గరిష్ట వాటా ముంబై, పుణె, ఢిల్లీ దక్కించుకున్నాయి. ముంబై 30 శాతం వాటాను కలిగి ఉండగా.. పుణె 18 శాతం, ఢిల్లీ 15 శాతం వాటాతో ఉన్నాయి. హౌసింగ్ విభాగంలో ఇదే జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ‘ఈ ఏడాది పొడవునా హౌసింగ్ మార్కెట్లో బలమైన ఊపు కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. రవాణా నెట్ వర్క్, హైవేలు, విమానాశ్రయాలు సహా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మెట్రో వ్యవస్థలు రియల్ ఎస్టేట్ వృద్ధికి దోహదపడతాయి’ అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈఓ అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు.
This website uses cookies.