కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కుల కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రూ.250 కోట్ల దాకా అక్రమ ఆస్తులను కూడబెట్టిన రెరా సభ్య కార్యదర్శి బాలకృష్ణ ఉదంతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. టీఎస్ రెరాలో ఉన్నప్పుడు బాలకృష్ణ పలు ప్రీలాంచ్ ప్రాజెక్టుల ఫైళ్లను రాత్రికి రాత్రే క్లియర్ చేసేవాడని విచారణలో తేలింది. అవి కాకుండా 111 జీవో ప్రాంతాల్లో సైతం భూమార్పిడి చేయించారనే విషయం బయటికొచ్చింది. మొత్తానికి, బాలకృష్ణ వ్యవహారం ప్రభావం టీఎస్ రెరా చీఫ్ మీద పడిందని పురపాలక వర్గాలు అంటున్నాయి. అందుకే, ఆయన్ని కూడా టీఎస్ రెరా చీఫ్ పదవిలో నుంచి తప్పించే అవకాశాలున్నాయని సమాచారం. ప్రీలాంచులకు అడ్డుకట్ట పడేందుకై.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బదులు.. సమర్థుడైన ఐఏఎస్ అధికారిని నియమించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. పైగా, ప్రస్తుత టీఎస్ రెరా ఛైర్మన్ మాజీ సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడనే పేరుంది. అతనిపై కేటీఆర్‌కు మంచి నమ్మకం ఉంది. టీఎస్ రెరా హెడ్‌గా మంచి అధికారిని నియమిస్తామని గతంలో పలు సందర్భాల్లో కేటీఆర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి.. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని రెరా చీఫ్ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అందుకే, ఆయన్ని రెరా నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిసింది. కాకపోతే, ఈ ప్రక్రియను పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి చేస్తారా? అంతకంటే ముందే చేస్తారా అనేది అతిత్వరలో తెలిసిపోతుంది.