అపార్ట్ మెంట్ ప్రాజెక్టు నిర్మాణ ప్లాన్, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థపై తెలంగాణ రెరా కన్నెర్రజేసింది. ఆ సంస్థకు రూ.10.6 లక్షల జరిమానా విధించింది. నిజాంపేటలోని ఓ అపార్ట్ మెంట్ ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, అప్రూవ్డ్ ప్రాజెక్టు ప్లాన్ ను మార్చేశారని.. హామీ ఇచ్చిన సౌకర్యాలు సైతం కల్పించలేదని పేర్కొంటూ ఫ్లాట్ ఓనర్స్ కో ఆపరేటివ్ మెయింటనెన్స్ సొసైటీ ఫిర్యాదు చేసింది. ఫ్లాట్ కొనుగోలు సమయంలో యజమానుల కోసం ప్రత్యేకంగా 60వేల చదరపు అడుగుల క్లబ్ హౌస్ తోపాటు సూపర్ మార్కెట్, లోకల్ కమర్షియల్ ఏరియా, గెస్ట్ రూమ్స్, ఫంక్షన్ హాల్, జిమ్, యోగా సెంటర్ వంటివి ఏర్పాటు చేస్తామని చెప్పారని.. కానీ అనంతరం ఎమినిటీస్ బ్లాక్ లోకి సొసైటీ సభ్యులు ఎవరూ వెళ్లకుండా గోడ కట్టేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా ఎమినిటీస్ బ్లాక్ ఎదురుగా ఉన్న గ్రీనరీని తొలగించారని నివేదించారు. పైగా డెవలపర్ క్లబ్ హౌస్ ను చిన్న చిన్న భాగాలుగా థర్డ్ పార్టీ వ్యక్తులకు విక్రయించడానికి ప్రయత్నించారని.. ఈ విషయంలో హెచ్ఎండీఏ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వెల్లడించారు. దీనిపై దర్యాప్తు జరిపిన టీజీ రెరా.. 30 రోజుల్లోగా టీజీ రెరా ఫండ్ కు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. క్లబ్ హౌస్ కు సొసైటీ సభ్యులకు యాక్సెస్ ఇవ్వాలని.. అక్కడ కట్టిన గోడ తొలగించాలని స్పష్టంచేసింది. అలాగే హైరైజ్ బిల్డింగ్స్ కు నిబంధనల ప్రకారం ఉండాల్సిన సోలార్ లైటింగ్, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించింది. అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారమే నిర్మాణం ఉండాలని స్పష్టంచేసింది.