- ఐటీ రాజధానిలో ఖరీదైన వ్యవహారంగా ఇంటి కొనుగోలు
- 29 శాతం మేర తగ్గిన మధ్యస్థ గృహాల లాంచింగ్
ఐటీ రాజధాని బెంగళూరులో గృహ కొనుగోలుదారులు స్థోమత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ధరలు, తగ్గిన అందుబాటు ఇళ్ల లభ్యత కారణంగా వారి సొంతింటి కల తీరని బెంగగా మిగిలిపోతోంది. 2023తో పోలిస్తే 2024లో మధ్యస్థ గృహాల కొత్త సరఫరా ఏకంగా 29 శాతం మేర తగ్గిపోయిందని నో బ్రోకర్ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది.
రియల్ ఎస్టేట్ డెవలపర్లు అధిక-మార్జిన్ వచ్చే లగ్జరీ ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి సారిస్తుండటంతో, బడ్జెట్ స్పృహ ఉన్న కొనుగోలుదారులు సొంతింటి కల నెరవేర్చుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బెంగళూరులో రూ.40 లక్షల నుంచి ₹80 లక్షల మధ్య ధర కలిగిన మధ్యస్థ గృహ ప్రాజెక్టుల ప్రారంభం 2024లో 29% తగ్గింది. రూ.90 లక్షల నుంచి రూ,కోటి విలువైన ప్రాపర్టీలు సైతం పరిమితంగానే ఉంటాయి. దీంతో చాలామంది శివారు ప్రాంతాలకు వెళ్లడం లేదా పాత ప్రాపర్టీలను కొనుగోలు చేయడం వైపు చూస్తున్నారని నివేదిక పేర్కొంది. అందుబాటు ధరల ఇళ్ల లభ్యత లేకపోవడం వల్ల ఎంట్రీ లెవల్ కొనుగోలుదారులకు సరైన ఆప్షన్లు లభించడంలేదని వివరించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు పున:విక్రయ మార్కెట్లో అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంది.
2023లో బెంగళూరులో మిడ్-ఎండ్ విభాగంలో 15,179 కొత్త లాంచ్‌లు జరగ్గా మొత్తం లాంచ్‌లలో ఇది 29% వాటా. 2024 వచ్చేసరికి ఈ సంఖ్య 14,876కి తగ్గింది. మొత్తం లాంచ్ లో ఇది 22% వాటా అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా, రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ విభాగంలో కొత్త లాంచ్ లు పెరిగాయని నివేదిక వెల్లడించింది. 2023లో ఈ విభాగంలో 29 శాతం లాంచ్ లు ఉండగా.. 2024లో 34 శాతానికి పెరిగాయని పేర్కొంది. 2023లో లగ్జరీ విభాగంలో 15,071 లాంచ్ లు జరగ్గా.. 2024లో 23,073 యూనిట్లకు పెరిగాయి. “ఈ ట్రెండ్ బెంగళూరు హౌసింగ్ మార్కెట్ మారుతున్న డైనమిక్స్ ను హైలైట్ చేస్తుంది. ఇక్కడ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ ఆధిపత్యం కొనసాగుతోంది. మధ్యతరగతి కొనుగోలుదారులకు తక్కువ ఎంపికలు ఉన్నాయి. పెరుగుతున్న భూమి ధరలు, పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు, అధిక లాభాల మార్జిన్లు కలిసి డెవలపర్లను ప్రీమియం సౌకర్యాలు, విశాలమైన ఇళ్లకు ప్రాధాన్యత ఇచ్చే సంపన్న కొనుగోలుదారులపై దృష్టి పెట్టేలా చేస్తున్నాయి” అని నివేదిక జోడించింది.