ప్రాజెక్టులో జాప్యం జరిగినందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ రహేజాకు జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) జరిమానా విధించింది. అంతేకాకుండా కొనుగోలుదారులు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ‘కొనుగోలుదారులు చెల్లించిన మొత్తం సొమ్మును 9 శాతం వార్షిక జరిమానాతో రెండు నెలల్లోగా తిరిగి చెల్లించాలి.
రెండు నెలలు దాటితో 12 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది’ అని పేర్కొంది. గుర్గావ్ సెక్టార్ 78లో రహేజా సంస్థ చేపట్టిన ‘రెవంటా’ ప్రాజెక్టు బాగా ఆలస్యమైంది. ప్రాజెక్టు ప్రారంభించి పదేళ్లు గడిచినా పనుల్లో సరైన పురోగతి లేదు. వాస్తవానికి నిర్దేశిత గడువు ముగిసి దాదాపు ఐదేళ్లు గడిచినా.. ఇంకా ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇది పూర్తి కావడానికి ఇంకా నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 30 మంది కొనుగోలుదారులు కమిషన్ ను ఆశ్రయించారు.