Categories: TOP STORIES

హైదరాబాద్లో ఫస్ట్ వుడెన్ హౌసింగ్ ప్రాజెక్ట్

దేశంలోనే అతిపిన్న రాష్ట్రమైనప్పటికీ.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో నెంబర్ వన్ గా నిలిచిందని చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం మహేశ్వరంలోని మ్యాక్ ప్రాజెక్ట్స్ లో కెనడా వుడెన్ హౌసింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆయ‌న ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అతిపిన్న రాష్ట్రమైన తెలంగాణ.. ఐటీ, ఫార్మా, విద్య, వ్యవసాయం.. ఇలా ప్రతి రంగంలోనూ తెలంగాణ దేశంలోనే అగ్ర‌గామిగా అవతరించిందని అన్నారు. అందుకే, తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. పురాతన రోజుల్లో ఆవు పేడ, మట్టి, కలపతో కలిపి ఇళ్లను నిర్మించిన ఘనచరిత్ర మన దేశంలో ఉందన్నారు.

 

కాకపోతే దురదృష్టం ఏమిటంటే.. మనదేశంలో కలపను కొట్టివేశామే తప్ప మళ్లీ పెంచలేదన్నారు. కెనడా మాత్రం కలపను పెంచుకుంటూ వచ్చిందన్నారు. కలప ఇళ్లను కొనాలని చూసేవారు.. ధర గురించి ఎక్కువగా బేరమాడకూడదని చెప్పారు. వీటి నిర్వహణ రుసుమూ అధికంగానే ఉంటుందని తెలిపారు. క‌ల‌ప‌తో త‌యారు చేసే ఇళ్ల‌కు ఆర్కిటెక్చ‌ర్లు స‌రికొత్త సోబ‌గుల‌తో తీర్చిద‌ద్దే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. కలప ఇళ్లకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తమకు అందజేయాలని కోరారు. కెనడా నుంచి కలప దిగుమతి చేసుకునేందుకు అవసరమయ్యే సాయాన్ని తాము అంద‌చేస్తామన్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీలో కెనడా హైకమిషనర్ ఆండ్రూస్ స్మిత్ మాట్లాడుతూ.. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తన కొలీగ్ విక్రమ్ జైన్ మాట ఇచ్చారని చెప్పారు. కెనడా వుడ్ హౌసింగ్ ప్రాజెక్టును ఆరంభించినందుకు నాసిర్ అలీఖాన్ కి ధన్యవాదాలు తెలిపారు. స్వయంగా ఆర్కిటెక్టు కావడం వల్ల ఈ ప్రాజెక్టు పట్ల తనకెంతో ఆసక్తిగా ఉందన్నారు. ఇరుదేశాల మధ్య వంద బిలియన్ డాలర్ల వాణిజ్యం ప్రస్తుతం జరుగుతుందని వెల్లడించారు. గత ఐదేళ్లలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 62 శాతం పెరిగిందన్నారు. మ్యాక్ ప్రాజెక్ట్స్ ఎండీ నాసిర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. కలప గృహాల్ని కొనుగోలు చేసే వారికి రాయితీలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్టాంప్ డ్యూటీ, ఆస్తి పన్ను వంటి వాటిలో రాయితీలను అందజేయాలని కోరారు.

This website uses cookies.