రూ.28 కోట్ల మేర మోసం చేసిన వ్యవహారంలో మూడు వేర్వేరు కేసుల్లో ఒకే రోజు ఐదుగురు డెవలపర్లను ముంబై ఆర్థిక నేరాల విభాగం అరెస్టు చేసింది. రూ.76 లక్షల మేర ఓ కొనుగోలుదారుడిని మోసం చేసినందుకు రాజేష్ సావ్లా, అశ్విన్ మిస్త్రీ, జయేష్ రామి అనే ముగ్గురు డెవలపర్లు అరెస్టయ్యారు. వీరు ముగ్గురూ రాజ్ ఆర్కేడ్స్ అండ్ ఎన్ క్లేవ్స్ డైరెక్టర్లు. వీరు 2019లో ఓ వ్యక్తికి రూ.76 లక్షలకు ఫ్లాట్ అమ్మారు.
అయితే, దానిపై వారు బ్యాంకు నుంచి రుణం తీసుకున్న సంగతిని దాచిపెట్టారు. దీంతో బాధితుడికి బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కేసు పోలీసుల నుంచి ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ కావడంతో దర్యాప్తు చేసి వారిని అరెస్టు చేసింది. ఆ ముగ్గురిపై ఇలాంటివే మరో ఆరు కేసులున్నాయని.. వాటిపైనా దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొంది. పైగా ఒకే ఫ్లాట్ ను వేర్వేరు వ్యక్తులకు అమ్మేశారని తెలిపింది.
మరో కేసులో సాయి లీ డెవలపర్స్ కి చెందిన మంగేష్ సావంత్ ను అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు కంపెనీకి భవనం నిర్మించి ఇస్తామని చెప్పి రూ.15 కోట్లు తీసుకుని కూడా పని చేయలేదు. దీంతో కంపెనీ ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశారు. ఇంకో కేసులో జయేష్ షా అనే డెవలపర్ అరెస్టయ్యారు. ఓషివారా లోని గౌరవ్ లెజెండ్ ప్రాజెక్టులో ఫ్లాట్ల అమ్మకం పేరుతో 30 మంది నుంచి రూ.12.14 కోట్ల మేర వసూలు చేసిన షా.. అసలు ఆ ప్రాజెక్టుకు అనుమతే తీసుకోలేదు. దీంతో అది ముందుకు కదల్లేదు. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు ఆయన్ను అరెస్టు చేశారు.