మన రాష్ట్రంలో భూముల కొనుగోళ్లకు టాప్ కారిడార్ ఏదో తెలుసా? కొంపల్లి-మేడ్చల్- శామీర్ పేట అట. ఈ విషయాన్ని కొలియర్స్ ఇండియా వెల్లడించింది. వచ్చే పదేళ్లలో వీటి నుంచి పెట్టుబడులపై ఐదు రెట్ల వరకు రాబడులు రావొచ్చని పేర్కొంది. అలాగే మహారాష్ట్రలోని నేరల్-మాతేరన్, గుజరాత్‌లోని సనంద్-నల్‌సరోవర్ కూడా టాప్ కారిడార్లలో ఉన్నాయని వివరించింది. ఈ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసే ఇన్వెస్టర్లు.. వాటిని వీకెండ్ హోమ్స్, హాలీడే హోమ్స్, రిటైర్మెంట్ హోమ్స్ గా అభివృద్ధి చేయడం ద్వారా స్థిరమైన అద్దె ఆదాయం పొందొచ్చని పేర్కొంది. పెట్టుబడి సైతం వృద్ధి చెందుతుందని, తద్వారా మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి-మేడ్చల్-శామీర్‌పేట కారిడార్‌లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్ ఇండియా అంచనా వేసింది. పెట్టుబడిని భూమి ఎన్నో రెట్లు పెంచగలదని, సరైన రీతిలో వినియోగిస్తే స్థిరమైన ఆదాయానికి వనరుగా మారుతుందని పేర్కొంది. అద్దె ఆదాయం, పెట్టుబడి వృద్ధి, వ్యాపార కార్యకలాపాల ద్వారా ఇలా ఎన్నో రూపాల్లో ఆదాయం పొందొచ్చని వివరించింది. దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో వచ్చే మక్రో మార్కెట్లకు రానున్న సంవత్సరాల్లో మంచి డిమాండ్ ఏర్పడుతుందని, స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఇవి మంచి రాబడులు ఇస్తాయని తెలిపింది.