Categories: TOP STORIES

ఓర్ఆర్ఆర్ వెలుపల ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు

హైదరాబాద్ నుంచి విదేశాలకు
భారీగా ఫార్మా ఎగుమతులు
డిప్యూటీ సీఎం భట్టి

విదేశాలకు ఎగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం ఎగుమతులు తెలంగాణ నుంచే అవుతున్నాయని ఇది తమ రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఫార్మా క్లస్టర్లను ఓఆర్ఆర్ వెలుపల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.శుక్రవారం హైటెక్స్ లో జరిగిన 73వ ఇండియన్ ఫార్మాసూటికల్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని అన్నారు.

పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న ఆయన పెట్టుబడిదారులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోందని ఆయన వివరించారు. ఏఐని అందిపుచ్చుకోవడానికి తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలిపారు. హైదరాబాద్ బౌల్ ఆఫ్ ఫార్మ గా స్థిరపడిందన్న ఆయన సుగంధ ద్రవ్యాల స్థాయి నుంచి మానవ జీవితాలను కాపాడే మందుల సరఫరా వరకు రాష్ట్రం చేరుకుందన్నారు. ఫార్మా రంగంలో అనేక ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని కితాబిచ్చారు. ఓఆర్ఆర్, ట్రిబుల్ ఆర్ ల మధ్య ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని భట్టి తెలిపారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఫార్మసిస్టులు వెన్నుముక లాంటి వారన్నారు. రోగి భద్రత, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఫార్మా రంగానిది కీలకపాత్ర అన్నారు. అత్యధిక నాణ్యతతో తక్కువ ధరకు జనరిక్ మెడిసిన్ ను ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తూ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు.

కోవిడ్ సమయంలో అసమానమైన చురుకుదనం ప్రదర్శించి, అవిశ్రాంతంగా శ్రమించారని ఫార్మసిస్టుల సేవలను భట్టి కొనియాడారు.అందరికీ ఆరోగ్యం అందుబాటులో తీసుకురావడం ద్వారా దృఢమైన సమాజాన్ని నిర్మించగలమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్తు, నీటి కొరత ఉండదన్నారు. త్వరలో రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీని ఆచరణలో తీసుకువస్తామని వివరించారు. గ్రీన్ ఎనర్జీ, మిగులు విద్యుత్తు ఉండేలా కొత్త చట్టంలో చర్యలు చేపట్టినట్టు వివరించారు.రాష్ట్ర ఆర్అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్‌ హయాంలో బాహ్య వలయ రహదారిని(ఓఆర్ఆర్) నిర్మించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఫలితంగా హైదరాబాద్‌కు ఎన్నో ఐటీ పరిశ్రమలు వచ్చాయన్నారు. రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం కూడా చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సీఎస్ఆర్‌ (కార్పొరేట్ సామాజిక బాధ్యత)లో భాగంగా తోడ్పాటు అందించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

This website uses cookies.